ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు (Allu Arjun) తెలుగులో ఏ స్థాయిలో గుర్తింపు ఉందో మలయాళంలో కూడా అదే స్థాయిలో గుర్తింపు ఉంది. మలయాళంలో బన్నీని ఫ్యాన్స్ ప్రేమగా మల్లూ అర్జున్ అని పిలుస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోల సినిమాలు మలయాళంలో విడుదలైనా బన్నీకి వచ్చిన స్థాయిలో ఆ హీరోలకు గుర్తింపు అయితే రాలేదనే సంగతి తెలిసిందే. ఈరోజు మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్ మూవీ ఏకంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడం గమనార్హం. మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం (Chidambaram S. Poduval) మాట్లాడుతూ నా జనరేషన్ లో బన్నీ సినిమాల ద్వారా మాత్రమే నాకు తెలుగు సినిమాలు తెలుసని ఆయన కామెంట్లు చేశారు.
బన్నీ సినిమాలు మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయని చిదంబరం చెప్పుకొచ్చారు. రాజమౌళి (Rajamouli) , సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) సినిమాలను నేను ఎంతో ఇష్టంగా చూస్తానని ఆయన తెలిపారు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అరుంధతి (Arundhati) సినిమా అంటే కూడా ఎంతో ఇష్టమని చిదంబరం చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లకు పాత మాయాబజార్ మూవీ ఒక బుక్ లాంటిదని ఆయన పేర్కొన్నారు.
తెలుగులో మంజుమ్మల్ బాయ్స్ సినిమాను రీమేక్ చేస్తే అనే ఆలోచన లేదని చిదంబరం అన్నారు. బన్నీ, రానా(Rana) , నాని (Nani) , నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఈ సినిమాకు సూట్ అవుతారని చిదంబరం వెల్లడించారు. భవిష్యత్తులో ఈ దర్శకుడు టాలీవుడ్ హీరోలతో సినిమా తీస్తారేమో చూడాలి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ హీరోలతో ఈ దర్శకుడు సినిమాలు తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు ఫీలవుతున్నారు.