67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభణ కారణంగా అవార్డులను ఒక ఏడాది పాటు నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ అనే మలయాళ సినిమాకి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. విడుదల కాకుండానే అవార్డు ఎలా ప్రకటించారని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి ఈ సినిమా గతేడాది మార్చి 26న విడుదల కావాల్సివుంది. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదు. గతేడాదే సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ రావడంతో ఈ సినిమాను 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది. ఈ ఏడాది మే 19న సినిమాను విడుదల చేయనున్నట్లు మోహన్ లాల్ ప్రకటించారు. కాగా.. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకి నాలుగు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాను ఎంపిక చేశారు.
తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ అవార్డు సొంతం చేసుకుంది. ‘మహర్షి’ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పని చేసిన రాజు సుందరంకి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా.. ‘జెర్సీ’ సినిమాకి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ గా అవార్డులు దక్కించుకున్నారు.