మన దేశ ఘనత సినిమాగా తీసుకొస్తున్నారట!

  • August 7, 2022 / 06:01 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గొప్పతనం గురించి చెప్పాలంటే.. అందులో మంగళ్‌యాన్‌ మిషన్‌ గురించి కచ్చితంగా ఉంటుంది. దీని గురించి బాలీవుడ్‌లో ‘మిషన్‌ మంగళ్‌’ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ఇదే మిషన్‌ గురించి ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. సంస్కృతంలో రూపొందించిన డాక్యమెంటరీ మూవీని త్వరలో ప్రదర్శించబోతున్నారు. ఆగస్టు 21న చెన్నైలో ఈ సినిమా ప్రీమియర్‌ను ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రారంభిస్తారు. అతి తక్కువ ఖర్చుతో ఇస్రో మార్స్‌ మిషన్‌ను రూపొందించింది.

తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా లక్ష్యాన్ని సాధించి అరుదైన ఘనత సొంతం చేసుకుందీ మిషన్‌. ఈ విజయాన్ని ‘యానం’ పేరుతో దర్శకుడు వినోద్‌ మంకర తెరకెక్కించారు. ప్రపంచ సినిమా చరిత్రలో తొలి సైన్స్‌ – సంస్కృత చిత్రంగా ఈ సినిమా రూపొందింది. ఇస్రో మాజీ చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ రచించిన ‘మై ఒడిస్సీ: మెమోయిర్స్‌ ఆఫ్‌ ది మ్యాన్‌ బిహైండ్‌ ది మంగళ్‌యాన్‌ మిషన్‌’ పుస్తకం ఆధారంగా ఈ డాక్యమెంటరీ మూవీని తెరకెక్కించారట.

ఇస్రో, శాస్త్రవేత్తల శక్తి సామర్థ్యాలను ప్రపంచం ముందు ప్రదర్శించడమే ఈ డాక్యుమెంటరీ లక్ష్యమని దర్శకుడు వినోద్‌ మంకర చెప్పారు. అన్ని పరిమితులను అధిగమించి, సంక్లిష్టమైన మార్స్‌ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే భారతీయ శాస్త్రవేత్తలు ఎలా సాధించారు అనే విషయాన్ని ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది అని ఆయన తెలిపారు. 45 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ పూర్తిగా సంస్కృతంలోనే ఉంటుందట.

మంగళయాన్‌ మిషన్‌ గురించి ఇప్పటికే బాలీవుడ్‌లో సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అక్షయ్‌ కుమార్‌, విద్యాబాలన్‌, సోనాక్షీ సిన్హా, తాప్సి, నిత్య మేనన్‌ తదితరులు ఈ సినిమాలో నటించారు. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 290 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే ఆ సినిమా కమర్షియల్‌ అంశాలతో ఉంటుంది. ఇప్పుడు వినోద్‌ తెరకెక్కించిన డాక్యుమెంటరీ విజ్ఞాన ప్రధానంగా ఉంటుంది అని చెబుతున్నారు. మరి ఈ డాక్యుమెంటరీ చూడటానికి సిద్ధమా?

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus