కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు పాన్ ఇండియా స్థాయిలో ఊహించని రేంజ్ లో గుర్తింపు ఉంది. ప్రస్తుతం విజయ్ పారితోషికం 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం. వారసుడు, లియో సినిమాలతో తెలుగులో సైతం మార్కెట్ ను పెంచుకున్న విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుండగా ఎట్టకేలకు ఆ ప్రచారం నిజమైంది. ఈరోజు విజయ్ కొత్త పార్టీని ప్రకటించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు.
తమిళగ వెట్రి కళగం పేరుతో విజయ్ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. మరోవైపు విజయ్ అభిమానులకు మరో భారీ షాకిచ్చారు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతానని విజయ్ వెల్లడించారు. 49 సంవత్సరాల వయస్సు ఉన్న విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) సినిమాతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలు విజయ్ 68వ, 69వ సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. మరోవైపు విజయ్ పార్టీ పేరుకు తమిళ విక్టరీ క్లబ్ అనే అర్థం వస్తుంది. పార్టీ పేరులో విజయాన్ని పెట్టుకున్న విజయ్ రాజకీయాల్లో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ రాజకీయాలు చేయబోతున్నారని తెలుస్తోంది. విజయ్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయనున్నారని సమాచారం అందుతోంది.
విజయ్ కొత్త పార్టీని (Tamizha Vetri Kazhagam) ప్రకటించడంతో తమిళనాడులోని ఇతర రాజకీయ పార్టీల అధినేతలకు టెన్షన్ మొదలైంది. భవిష్యత్తులో విజయ్ సీఎం కావడం ఖాయమని అందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కు పొలిటికల్ గా అండగా నిలబడతామని ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.