మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సంవత్సరం ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘వాల్మీకి’ చిత్రంలో నటిస్తున్న వరుణ్… ఆగష్టు నుండీ మరో చిత్రాన్ని కూడా మొదలు పెట్టనున్నాడు. కెరీర్ మొదట్లో కాస్త తడబడినా ‘ఫిదా’ చిత్రం నుండీ కోలుకున్నాడు. ‘తొలిప్రేమ’ చిత్రం కూడా సూపర్ హిట్టయ్యింది. కేవలం స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసి ప్రేక్షకుల్ని విసిగించకుండా సరికొత్త కథల్ని ఎంచుకుంటూ.. ముందుకు సాగుతున్నాడు. ఓ చిత్రం మీడియం డైరెక్టర్ తో చేస్తుంటే.. మరో చిత్రం కొత్త డైరెక్టర్ తో చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తనకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తన రెమ్యూనరేషన్ ను పెంచేసాడట. ప్రస్తుతం వరుణ్ కి 20 నుండీ 25 కోట్ల వరకూ మార్కెట్ ఉంది. ఇప్పటి వరకూ 3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చిన వరుణ్ … ఇప్పుడు తనకున్న డిమాండ్ ని బట్టి ఐదు కోట్లు చేసాడట. ఇది ఒక రకంగా షాకింగ్ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ అందరి నిర్మాతలకి అందుబాటులో ఉండడంతో మంచి స్క్రిప్ట్ లు ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. కానీ ఇలా రెమ్యూనరేషన్ పెంచేస్తే మీడియం నిర్మాతలు వరుణ్ దగ్గరకు వస్తారా అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం. ఇకపోతే వరుణ్ నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుందని సమాచారం.