Chiranjeevi: చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే.. మెగాస్టార్‌ మాటల్లో…

బుధవారం విజయవాడ సమీపంలో కేసరపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంతా ఒకెత్తు అయితే.. ఆఖరులో చిరంజీవి (Chiranjeevi) , పవన కల్యాణ్‌ (Pawan Kalyan) చేతులు పట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివాదం మరో ఎత్తు అని చెప్పాలి. ఆ తర్వాత చిరంజీవి, పవన్‌ను ప్రధాని మోదీ భుజం తట్టి మెచ్చుకోవడమూ చూశాం. ఆ సమయంలో చిరంజీవితో ప్రధాని ఏదో మాట్లాడారు. అప్పుడు వాయిస్‌ వినిపించలేదు కానీ.. అక్కడ ఏం మాట్లాడారో చిరంజీవి చెప్పుకొచ్చారు.

ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌తో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవిని మోదీ, చంద్రబాబు దగ్గరకు రమ్మని పవన్‌ పిలవగా.. ఎందుకు మనమే వెళ్దాం అంటూ చేయి పట్టుకుని లాగి మరీ చిరంజీవి వద్దకు వెళ్లారు మోదీ. ఇదంతా మనకు వీడియోలో కనిపస్తోంది. అక్కడ మోదీ ఏమన్నారో చిరంజీవి మాటల్లోనే…

నాతో, తమ్ముడు పవన్‌తో ప్రధాని మోదీ మాట్లాడడం ఆనందానిచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ ఇంటికొచ్చినప్పటి వీడియోను మోదీ చూశారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఆ వీడియోలో కనిపించాయని మోదీ చెప్పారు. మన సంస్కృతిసంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ఆ దృశ్యాలు ప్రతిబింబించాయని ప్రధాని అభినందించారు. ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రధాని మాతో అలా మాట్లాడడం నాకెంతో సంతోషాన్నిచ్చింది అని చిరంజీవి చెప్పారు.

ప్రధాని మోదీ సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో జరిగిన ఈ సంభాషణ కూడా కలకాలం మాకు గుర్తుండిపోతుంఇ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ యూట్యూబ్‌ ఛానల్స్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌ అవుతున్న ఆ వీడియోకు ఇప్పటికే కోట్లలో వ్యూస్‌ వస్తున్నాయి. ఇప్పుడు మోదీ చెప్పిన విషయాలు, చిరంజీవి పోస్టుతో ఆ వీడియో మరింత వైరల్‌గా మారుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus