మీరెప్పుడైనా థియేటర్‌లో సినిమా చూస్తే ఏడ్చేశారా. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు రావడం లేదు కానీ.. ఆ రోజుల్లో ఎన్ని వచ్చేవో. అలా వచ్చిన సినిమాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకోని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇదే పరిస్థితి ఎదురైందట. అయితే దాంతో పాటు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైందట. అది అతని పెళ్లి సమయంలో అడ్డు వస్తుందేమో అని భయపడ్డాడట. ఈ విషయాన్ని ఇటీవల ‘ఆహా’లోని ‘సామ్‌జామ్’ షోలో చెప్పుకొచ్చాడు.
‘‘శంకరాభరణం’లో నటించిన మంజుభార్గవి ‘కోతలరాయుడు’లో నాతో నటించింది. ఆ పరిచయంతో ‘శంకరాభరణం’ ప్రిమియర్ షోకు నన్ను ఆహ్వానించింది. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. అల్లు రామలింగయ్య కుటుంబంతో కలసి సినిమా చూడటానికి వచ్చారు. క్లైమాక్స్‌కి వచ్చేసరికి కన్నీళ్లు ఆగలేదు. థియేటర్‌లో లైట్స్ ఆన్ చేస్తే నేను ఏడ్చాననే విషయం అందరికీ తెలిసిపోతుందని, కర్చీఫ్ కోసం వెతికాను. ఆ సమయంలో కన్నీళ్లు తుడుచుకో అని మంజుభార్గవి తన చీర కొంగు అందించింది.
సరిగ్గా కన్నీళ్లు తుడుచుకున్నానో లేదో లైట్స్ ఆన్ అయ్యాయి. నా చేతిలో ఆమె చీర కొంగు చూసి అందరూ ఏం అనుకున్నారో అనిపించింది. కొంతకాలానికి నాకూ-సురేఖకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ‘శంకరాభరణం’ ప్రీమియర్ సమయంలో సురేఖ నన్ను చూసే ఉంటుందేమో, పెళ్లికి నో అనే చెబుతుందని కంగారు పడ్డాను. కానీ ఆమె పెళ్లికి అంగీకరించింది’’ అని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు చిరు.
చిరంజీవి సినిమాల్లో కీలక సమయంలో వచ్చి పరాజయం మూటగట్టుకున్న చిత్రం ‘వేట’. ఆ సమయంలో చిరు బాగా ఏడ్చేశారట. ‘‘ఖైదీ’ తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ‘వేట’పై చాలా ఆశలు పెట్టుకున్నాను. కాకపోతే ఆ సినిమా నిరాశపరిచింది. దాంతో చాలా బాధపడ్డాను. ‘విజేత’ ఎప్పుడు చూసినా నాకు కన్నీళ్లు వచ్చేస్తాయ్’’ అంటూ తన కన్నీళ్ల గురించి వివరించాడు చిరు. అలాగే తనకు తన జీవిత కథ రాయాలని ఉందని చిరు చెప్పారు. దాని ద్వారా కొంతమందిలోనైనా ప్రేరణ నింపాలని అనుకుంటున్నట్లు చెప్పారు చిరు.