పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి మిడిల్ రేంజ్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న శర్వానంద్ పడిపడి లేచే మనసు, జాను, రణరంగం సినిమాల తరువాత నటిస్తున్న శ్రీకారం సినిమా గురువారం రోజున మహాశివరాత్రి కానుకగా విడుదల కానుంది. వరుస ఫ్లాపులతో కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న శర్వా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిన్న శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరగగా స్టార్ హీరో రామ్ చరణ్ కోరిక మేరకు చిరంజీవి ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చిరంజీవి ఈ వేడుకలో మాట్లాడుతూ యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలని, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ కావాలని అనుకుంటాడని రైతు కొడుకు మాత్రం రైతు కావాలని అనుకోడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు కొడుకు రైతు అయ్యే రోజులు మళ్లీ రావాలని చిరంజీవి పేర్కొన్నారు. శర్వానంద్ చిన్న వయస్సులో ఉన్న సమయంలో తనతో కలిసి థమ్స్ అప్ యాడ్ లో నటించాడని తనకు శర్వానంద్ మరో రామ్ చరణ్ అని చిరంజీవి పేర్కొన్నారు.
శర్వానంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించాడని.. ఒక విధంగా చెప్పాలంటే శర్వానంద్ నటనకు తానే శ్రీకారం చుట్టానని చిరంజీవి తెలిపారు. శర్వానంద్ మాట్లాడుతూ సంకల్పం గొప్పదైతే దేవుడు తలరాతను తిరగరాస్తాడని చిరంజీవి చెప్పాడని మెగాస్టార్ చెప్పిన ఆ మాటలను తాను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. చాలామందికి వారసత్వం ద్వారా ఆస్తులు వస్తాయని.. కానీ తన స్నేహితుడు రామ్ చరణ్ కు చిరంజీవి గారి క్యారెక్టర్ వారసత్వంగా వచ్చిందని అన్నారు. అది ఇంకెవ్వరికీ దక్కదని శర్వానంద్ అన్నారు. మార్చి 11న విడుదల కాబోతున్న శ్రీకారం సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.