ఈరోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అభిమానులు పుట్టినరోజు వేడుకను పండుగలా జరుపుకుంటున్నారు. ఈరోజు ఇంద్ర (Indra) , శంకర్ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada M.B.B.S) సినిమాలు రీరిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే చిరంజీవికి మాత్రమే సొంతమైన, సాధ్యమైన, అరుదైన రికార్డులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సినిమా రంగంలో కోటి రూపాయల రెమ్యునరేషన్ ను సొంతం చేసుకున్న తొలి భారతీయ నటుడు చిరంజీవి కాగా 1992 సంవత్సరంలో మెగాస్టార్ ఇంత మొత్తం పారితోషికం అందుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పసివాడు ప్రాణం మూవీతో మెగాస్టార్ బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేసి బ్రేక్ డ్యాన్స్ తో మెప్పించారు. చిరంజీవి తన సినీ కెరీర్ లో ఏకంగా 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు.
డ్యూయల్ రోల్స్ తో పాటు ట్రిపుల్ రోల్స్ లో సైతం మెప్పించిన హీరో చిరంజీవి కాగా సక్సెస్ రేట్ విషయంలో సైతం చిరంజీవి టాప్ లో ఉన్నారు. తన ప్రతిభతో చిరంజీవి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులను సైతం అందుకున్నారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా చిరంజీవి నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. కొత్త హీరోల సినిమాల ఈవెంట్లకు హాజరై ప్రచారం చేసే అతికొద్ది మంది హీరోలలో చిరంజీవి ఒకరు.
ఆ కొత్తవాళ్లలో నన్ను నేను చూసుకుంటానని అందుకే ఆ ఈవెంట్లకు వెళ్తానని చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇంద్ర సినిమాతో చిరంజీవి అప్పట్లో 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించారు. 1980, 1983 సంవత్సరాలలో చిరంజీవి ఏడాదికి 14 సినిమాల చొప్పున విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వయంకృషి (Swayam Krushi) రష్యన్ భాషలోకి డబ్ అయిన తొలి తెలుగు మూవీ కావడం గమనార్హం.