Megastar Chiranjeevi: బర్త్‌డే స్పెషల్‌: మరో ‘చిరంజీవి’ అవ్వడం కష్టమే.. ఆయన చెప్పినవి చేసినా చాలు!

  • August 22, 2024 / 01:39 PM IST

సమాజంలో ఎలా అయితే ఎవరు ఎలా ఉండాలి అనే విషయంలో నిర్దిష్టమైన రూల్స్‌ లేవో.. సినిమా ఇండస్ట్రీలో కూడా లేవు. అయితే సీనియర్ నటులు నడిచిన దారిలో, చూపించిన దారిలో ముందుకు వెళ్తే.. ఆటోమేటిగ్గా పద్ధతి వచ్చేస్తుంది. పరిశ్రమ పది కాలాల పాటు హాయిగా సాగుతుంది. పరిశ్రమ ఇప్పుడు ఇలా ఉంది అంటే.. మన సీనియర్‌ హీరోలు నడిచి, చూపించిన దారే కీలకం అని చెప్పాలి. అందులో చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Megastar Chiranjeevi

సినిమాల్లోకి వద్దాం అనుకునేవారు, సినిమాల్లోకి వచ్చినవాళ్లు.. ఇలా ఎవరైనా ‘చిరంజీవిని చూసే వచ్చాం. ఆయనే మాకు స్ఫూర్తి’ అని అంటారు. నటులే కాదు, సాంకేతిక నిపుణులకు కూడా ఆయన ఆదర్శం. ఇది మా మాట కాదు.. ఎంతోమంది యువ నటులు, సాంకేతిక నిపుణులు చెప్పిన మాటే. అయితే ఇక్కడో విషయం మాట్లాడుకోవాలి. అందరూ ‘చిరంజీవి’ అవ్వడం కష్టమే. అయితే ఆయన చెప్పినవి, ఆచరించినవి చేస్తే ఆ స్థాయికి వచ్చే అవకాశం ఉంది.

‘మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి’… చిరంజీవి (Megastar Chiranjeevi) ఏ సంద్భంలో ఈ మాట చెప్పారో మీకు తెలిసే ఉంటుంది. ఆ సందర్భం ఏంటి అనేది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. అయితే గ్రూపుగా మనం ఏదైనా చేద్దాం అనుకునేటప్పుడు ఈ మాట కచ్చితంగా పనికొస్తుంది. సిని‘మా’ నటులు ఈ విషయాన్ని పట్టించుకుంటే పరిశ్రమ ఇంకా బాగుంటుంది. ఇక నిజ జీవితంలోనూ ఇది చాలా ఉపయోగకరం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సినిమా సెట్‌లో షూటింగ్‌ గ్యాప్‌లో చిరంజీవి క్యారవ్యాన్‌లోకి వెళ్లరు. టీమ్‌ అందరితో కూర్చుని మాట్లాడటమో, ఏ చెట్టు కింద కూర్చుని ఏదో వ్యాపకం చేసుకోవడమే లాంటివి చేస్తుంటారు. ఆయనతో పని చేసిన నటులు ఈ విషయాన్ని చెప్పారు. మరి దీనిని ఇప్పటితరం నటులు ఎంతవరకు ఫాలో అవుతున్నారో వాళ్లకే తెలుసు. ఇక ఇది నిజ జీవితంలోకి తీసుకుంటే.. అందరితో కలిసి ఉంటే అనుబంధం పెరుగుతుంది. నాకు నేను అని అనుకుంటే కష్టమే అని చెప్పొచ్చు.

టాలీవుడ్‌లోకి పార్టీ కల్చర్‌ తెచ్చింది చిరంజీవే అని కొందరు ఆయన్ను ఆడిపోసుకుంటారు కానీ.. అభిమానులు వర్గాలుగా మారి నానా గొడవలు పెట్టుకుంటున్న క్రమంలో ‘మేమంతా ఒకటే’ అని చెప్పకనే చెప్పడానికి పార్టీలు, గేదరింగ్‌లు పెట్టడం స్టార్ట్‌ చేశారు చిరు. ఆ తర్వాత అభిమానుల గొడవలు తగ్గాయి అని అంటారు. ఇప్పటితరం నటులు చాలావరకు కుటుంబ స్నేహితులు కాబట్టి తరచుగా కలుస్తుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఈ ఫీలింగ్‌ రావడం లేదు. ‘మేము మేమే’ అనుకుంటున్నారు.

తనతో కలసి నటించిన నటులకు ఏదైనా ఇబ్బంది వస్తే.. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టడం అంత ఈజీనా? కానీ చిరంజీవికి (Megastar Chiranjeevi) సాధ్యం. నటుడు పొన్నాంబళం విషయమే తీసుకోండి. తన సినిమాల్లో నటించిన పరిచయం మాత్రమే ఉన్న ఆయన అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం రూ. 60 లక్షలు ఖర్చు పెట్టారు చిరంజీవి. అయినా ఇది ఒక వ్యక్తికి చేసిన సాయమే. ఆయన ఎవరికీ చెప్పని, తెలియని గుప్త సహాయాలు చాలానే చేశారని పవన్‌ కల్యాణే చెప్పుకొచ్చారు. అంతేసి ఇవ్వమని చెప్పం, చెప్పలేం కానీ.. మనకు చేతనైనంత సాయం మంచిదే అని చెప్పగలం.

అన్నింటికీ మించి.. తను నడిచిన ముళ్ల దారి, రాళ్ల దారిని తన తర్వాతి తరం పూల దారి చేయడానికి చిరంజీవి చేయని కృషి లేదు. ఆ దారి మీద ఆయన కుటుంబం మాత్రమే నడిస్తే అది స్వార్థం. మొత్తంగా ఆయన అభిమానులు, అనుచరులు, సగటు జనాలు నడిస్తే అది గొప్ప పనే కదా. ఇలా ఎన్నో మంచి చేసిన చిరంజీవిని ఇప్పటికీ కొందరు అతను ‘అందరివాడు’ కాదు అంటారు. ఇండస్ట్రీ పెద్ద కాదు అని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతారు. అయితే ఆ మాటల్ని కూడా ఆయన మనసుకు తీసుకోలేదు.

సినిమా పరిశ్రమకు అవసరం వచ్చినప్పుడు పెద్ద కొడుకులా వచ్చి నిలబడ్డారు. సినిమా పరిశ్రమ అన్నా, పరిశ్రమలో మనుషులు అన్నా అదో రకమైన చిన్న చూపు చూసిన గత ప్రభుత్వం దగ్గరకు అందరినీ తీసుకెళ్లి.. పరిశ్రమ కోసం రెండు చేతులూ జోడించి మరీ రిక్వెస్ట్ చేశారు. అది ఆయన చేతగానితనం కాదు.. పరిశ్రమకు మంచి జరగాలనే మంచి ఆలోచన. అదేదో సినిమాలో పవన్‌ కల్యాణ్‌తో (Pawan Kalyan) త్రివిక్రమ్‌ (Trivikram) ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు’ అని చెప్పించారు. దానికి ‘అలా తగ్గినోడే అందరివాడు.. మన చిరంజీవుడు’ అని యాడ్‌ చేయొచ్చు.

రామ్‌ చరణ్‌తో సెల్ఫీ.. కల నెరవేరింది అంటూ మెల్‌బోర్న్‌ మేయర్‌..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus