తనయుడు పూరీ ఆకాష్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాస్ పల్స్ మస్త్ బాగా తెలిసిన పూరీ జగన్నాధ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం “మెహబూబా”. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, అందులోనూ తన కుమారుడు హీరో కావడంతో ఆయన అభిమానులు సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. మరి ఆ ఆశలను పూరీ తీర్చగలిగాడా? తన కుమారుడికి మంచి లాంచ్ ప్యాడ్ లా “మెహబూబా” చిత్రాన్ని మలచగలిగాడా లేదా? అనేది చూద్దాం..!!
కథ :
1971లో ఇండియా-పాకిస్తాన్ నడుమ ఇండియన్ బోర్డర్ లో జరిగిన ఓ చిన్నపాటి యుద్ధ సమయంలో దగ్గరవుతారు పాకిస్తాన్ సోల్జర్ కబీర్ (పూరీ ఆకాష్), ఇండియన్ సిటిజన్ మధిర (నేహా శెట్టి). యుద్ధం ముగిసిన తర్వాత కబీర్ మళ్ళీ పాకిస్తాన్ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన కబీర్-మధిర దూరమవ్వడానికి మనసొప్పక సరిహద్దులను సైతం పట్టించుకోకుండా దగ్గరవ్వడానికి ప్రయత్నించి.. ఆ సమయంలో చోటు చేసుకొన్న చిన్నపాటి యుద్ధంలో ప్రాణాలు విడుస్తారు.
కట్ చేస్తే.. పాకిస్తానీ సిపాయి కబీర్ ఇండియన్ సిటిజన్ రోషన్ గా పుడితే.. ఇండియన్ సిటిజన్ అయిన మధిర పాకిస్తానీ సిటిజన్ అఫ్రీన్ గా మళ్ళీ పుడతారు. మళ్ళీ 2017లో కలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నం ఫలించిందా లేదా? మళ్ళీ సరిహద్దులు వారి ప్రేమకు అడ్డంకిగా నిలిస్తే వారు ఎలా ఎదుర్కొన్నారు? అనేది “మెహబూబా” కథాంశం.
నటీనటుల పనితీరు :
జూనియర్ రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ గా నటించినప్పుడే తనదైన శైలి నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న పూరీ ఆకాష్ ఈ చిత్రంలోనూ కథానాయకుడిగా బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ విషయాల్లో అలరించాడు. అయితే.. కథలోని ఇంటెన్సిటేకి కుర్రాడి ఏజ్ కి సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తరహాలో ఆకాష్ పూరీది కూడా ఎర్లీ ఎంట్రీ అనిపిస్తుంది.
నటుడిగా మాత్రం కుర్రోడికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే.. వయసు, ఇమేజ్ కు తగ్గ కథలు సెలక్ట్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. నేహా శెట్టి చూడ్డానికి అందంగా ఉండి, అభినయం పరంగానూ ఆకట్టుకొన్నప్పటికీ.. ఆకాష్ పక్కన మాత్రం అతనికంటే వయసులో పెద్దదానిలా కనిపించింది. విలన్ గా నటించిన విషు రెడ్డికి చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ కుదరలేదు. లుక్స్ పరంగా విలనిజం కూడా పెద్దగా ప్రదర్శించలేకపోయాడు. తల్లిదండ్రుల పాత్రల్లో షాయాజీ షిండే, మురళీశర్మ, అశ్విని కల్సేకర్ లు ఆకట్టుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు :
సంగీత దర్శకుడు సందీప్ చౌతాకి డైరెక్టర్ పూరీ జగన్నాధ్ “ఇది హిందూ ముస్లిం లవ్ స్టోరీ” అని బాగా ఇంజెక్ట్ చేసేశాడో ఏమో తెలియదు కానీ.. ఓపెనింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకూ ఒకేరకమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ ఒకటే థీమ్ సాంగ్స్ తో విసిగించేశాడు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ఒక్కటే ఈ చిత్రానికి ఏకైక ప్లస్ పాయింట్ అండ్ ఎస్సెట్. కథ, కథనంతో సంబంధం లేకుండా తనదైన సినిమాటోగ్రఫీతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాడు.
సాధారణంగా పూరీ జగన్నాధ్ సినిమాలంటే కథ-కథనం ఎవ్వరూ ఎక్స్ ఫెక్ట్ చేయరు. ఆయన శైలి సంభాషణలు, హీరో క్యారెక్టరైజేషన్ కోసం మాత్రం థియేటర్ కి వస్తారు ముప్పాతికశాతం జనాలు. అలాంటి పూరీ జగన్నాధ్ తన పంధా మార్చుకోవాలని ప్రయత్నించిన ప్రయత్నం బాగున్నా.. ఆ తీరు మాత్రం బాగోలేదు. “మెహబూబా” సినిమా మొత్తానికి ఒక్కటంటే పూరీ జగన్నాధ్ మూమెంట్ లేకపోవడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. పూరీ దర్శకత్వంలో తెరకెక్కి ఫ్లాపైన “ఏక్ నిరంజన్, బుజ్జిబాడు” చిత్రాల్లో కూడా కాసిన్ని అలరించే సన్నివేశాలుంటాయి. అలాంటిది “మెహబూబా”లో ఆకాష్ “మానుషలందరూ చచ్చిపోతే బెటర్” అని చెప్పే థియరీ తప్ప పూరీ మార్క్ అనేది ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇక క్లైమాక్స్ చిత్రీకరించిన విధానం చూస్తే.. అసలు పూరీ జగన్నాధ్ గారే ఈ సినిమాని డైరెక్ట్ చేశారా అనే సందేహం రాకమానదు.
వర్మ తర్వాత ఆయన శిష్యరికాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి పూరీ జగన్నాధ్.. ఆయన ఫిలిమ్ మేకింగ్ ఎంతోమంది నవతరం దర్శకులకు పాఠ్యాంశం, ఇక ఆయన సినిమాల్లోని హీరో లేదా విలన్ క్యారెక్టరైజేషన్స్ ప్రస్తుత డైరెక్టర్స్ మీద చూపిన ప్రభావం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి పూరీ జగన్నాధ్ మీద అభిమానం ఆయన ఫ్లాప్ సినిమాతో పోదు, ఆయన హిట్ సినిమాలతో పుట్టదు. దుకంటే అది ఆయన తీసిన సినిమాల మీదున్న మర్యాద కాదు ఆయన మీద, ఆయన ఆలోచనా విధానం మీదున్న గౌరవం. సో, ఆయన మీద అదే గౌరవంతో ఆయన దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమా కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటారు ప్రతి సినిమా అభిమాని.
విశ్లేషణ :
పూరీ జగన్నాధ్ వీరాభిమానుల్ని కూడా ఈ చిత్రం ఆకట్టుకోవడం కష్టం, ఇక మొన్న విడుదలైన “మహానటి” ముందు “మెహబూబా” నిలదొక్కుకోవడం అనేది అనితరసాధ్యం. కావున, పూరీ పడిన శ్రమ మరోమారు విఫలమైనట్లే.