“హనుమాన్”తో సూపర్ హీరోగా మారిన తేజ సజ్జా ప్రధాన పాత్రలో సినిమాటోగ్రాఫర్ టర్నడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం “మిరాయ్” (Mirai). సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పెంచగా, తేజ ప్రతి భాషలో చేసిన ప్రమోషన్స్ సినిమాని మరింత మందికి చేరువ చేసింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: అశోకుడు మహాయుద్ధం గెలిచిన తర్వాత అక్కడ రక్తపాతాన్ని చూసి చలించిపోయి తనకున్న శక్తులను ఒక తొమ్మిది పుస్తకాల్లో నిక్షిప్తం చేసి, ఆ పుస్తకాలను 8 మంది యోధులు మరియు ఒక యోగికి ఇచ్చి భద్రపరచమని చెప్తాడు.
కలియుగంలో మహాభీర్ లామా (మంచు మనోజ్) ఆ పుస్తకాల ద్వారా శక్తులు సొంతం చేసుకొని.. భూమి మీద అర్హత లేనివాళ్లందరినీ చంపేయాలని నిశ్చయించుకుంటాడు.
అత్యంత శక్తిమంతుడైన మహాబీర్ లామాను ఎదుర్కొనే ఏకైక శక్తి మిరాయ్, దాన్ని చేజిక్కించుకొని, తద్వారా లోక కళ్యాణం చేకూర్చే బాధ్యత వేద (తేజ సజ్జా) మీద పడుతుంది. దాన్ని అతడు ఎలా నెరవేర్చాడు? అందుకోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అతడికి విభా (రితిక నాయక్) ఎలా సహాయపడింది? అనేది “మిరాయ్” (Mirai) కథాంశం.
నటీనటుల పనితీరు: హీరో తేజ సజ్జా అయినప్పటికీ.. స్క్రీన్ ప్రెజన్స్ లో మాత్రం మంచు మనోజ్ డామినేషన్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. తేజ కంటే మంచి ఎలివేషన్స్ మనోజ్ కి పడ్డాయి. యాక్షన్ బ్లాక్ లో మనోజ్ లుక్స్, డ్రెస్సింగ్ & బాడీ లాంగ్వేజ్ చాలా యాప్ట్ గా ఉంది.
తేజ సజ్జా ఇదే తరహాలో మంచి కథాబలం ఉన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ వెళితే, హీరోగా అతడి రేంజ్ ని ఎవరూ అందుకోలేరు. యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సీన్స్ లో అతడి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ లో కళ్లతో పలికించే చాలా భావాలు బాగా వర్కవుట్ అయ్యాయి.
శ్రియ శరణ్ కి చాలా రోజుల తర్వాత మంచి బరువైన పాత్ర లభించింది. నిజానికి సినిమాకి ఆమె పోషించిన అంబిక పాత్ర చాలా కీలకం. సినిమాకి మరో ఎస్సెట్ గా నిలిచింది.
మలయాళ నటుడు జయరాం కి కూడా మంచి క్యారెక్టర్ పడింది. అగస్త్య మహర్షిగా ఆయన నటన, టైమింగ్ మంచి ఫన్ యాడ్ చేశాయి.
దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రంలో పిరికి పోలీస్ ఆఫీసర్ గా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అతడి డైలాగ్ డెలివరీ భలే కామెడీ పండేలా చేసింది. వెంకటేష్ మహా కూడా కనిపించిన కాసేపు అలరించాడు. జగపతిబాబు కూడా మంచి వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: గౌర హరి బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమాలోని ఎలివేషన్స్ కి ప్రాణం పోసి, చాలా చోట్ల సినిమా డల్ అవుతున్న తరుణంలో తన పనితనంతో గట్టెక్కించాడు.
సీజీ వర్క్ చాలా బాగుంది. 60 కోట్ల బడ్జెట్ లో ఈ స్థాయి అవుట్ పుట్ తీసుకొచ్చారు అంటే మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా సంపతి పక్షి సీన్స్ అద్భుతంగా వచ్చాయి. రెండుసార్లు ఆ పక్షి పాత్రతో హీరో పాత్రని ఎలివేట్ చేసిన విధానం మంచి సినిమాటిక్ హై ఇస్తుంది. అయితే.. కొన్ని చోట్ల AI షాట్స్ మాత్రం ఇబ్బందిపెట్టాయి. అక్కడ కూడా CGI కే వెళ్లిపోవాల్సింది.
ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. అంటే సన్నివేశాలు కట్ చేయకుండా కాస్త స్పీడప్ చేయాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ల్యాగ్ అనేది ఇబ్బంది పెడుతుంది.
దర్శకుడు/సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కథను మొదలుపెట్టిన విధానం, సెటప్, స్టేజింగ్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఒక అసాధారణమైన యువకుడు తన గమ్యాన్ని గుర్తించి దాన్ని చేరుకోవడం చేసే ప్రయాణాన్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. అయితే.. ఎగ్జిక్యూషన్ విషయంలోనే ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. హాలీవుడ్ సినిమాలు “కుంగ్ ఫూ హసల్, స్పైడర్ మ్యాన్” నుండి స్ఫూర్తి పొంది తీసుకిని రాసుకున్న యాక్షన్ బ్లాక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా మదర్ ఎమోషన్ ను సినిమా మొత్తం క్యారీ చేసిన విధానం బాగుంది. కార్తీక్ మునుపటి సినిమా “ఈగల్” విషయంలో ప్రాసలకి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను కాస్త సీరియస్ గా తీసుకున్నట్లున్నాడు.. మిరాయ్ లో ఎక్కడా అనవసరమైన ప్రాసలు వినిపించలేదు. ఓవరాల్ గా.. మిరాయ్ తో కార్తీక్ దర్శకుడిగా మొట్టమొదటి హిట్ కొట్టాడనే చెప్పాలి.
విశ్లేషణ: మనం కథల కోసం వేరే దేశాలకు, పరాయి దేశపు గాథలు ఎత్తుకురానక్కర్లేదు. మన ఇతిహాసాల్లోనే బోలెడు అద్భుతమైన కథలు ఉన్నాయి. ఆ విషయాన్ని “మిరాయ్” మరోసారి గుర్తుచేసింది. అయితే.. రాముడు సీక్వెన్సులను మరీ ఎక్కువసార్లు చూపించడం వల్ల, క్లైమాక్స్ లో వావ్ ఫ్యాక్టర్ మిస్ అయ్యింది. ఆ విషయంలో కార్తీక్ ఇంకాస్త కేర్ ఫుల్ గా ఉండాల్సింది. సెకండాఫ్ లో కథనం ముందుకెళ్లడానికి కాస్త మొరాయించినా.. స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ తో మైమరపించే ప్రయత్నం చేసి మొత్తానికి ఆడియన్స్ ను అలరించాడు కార్తీక్ ఘట్టమనేని!
ఫోకస్ పాయింట్: మార్వెలస్ మిరాయ్!
రేటింగ్: 3.5/5