వరుణ్ తేజ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మిస్టర్”. “ఆగడు, బ్రూస్ లీ” లాంటి డిజాస్టర్ల తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది రివ్యూ చదివి తెలుసుకోండి..!!
కథ : మిస్టర్ చై (వరుణ్ తేజ్) స్పెయిన్ లో ఓ ధనిక వర్గ కుటుంబంలో పుట్టి ఖాళీగా తిరుగుతుంటాడు. ఎయిర్ పోర్ట్ నుండి పికప్ చేసుకోవాల్సిన అమ్మాయిని కాకుండా పొరపాటున మీరా (హెబ్బా పటేల్)ను తీసుకొచ్చేస్తాడు. అలా మొదలైన కథ చై అప్పుడే పరిచయమైన మీరాతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడం, మీరా అప్పటికే వేరే అబ్బాయిని ప్రేమించడం, మీరా ప్రేమించిన అబ్బాయిని తన అన్నయ్య కారణంగా పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఏర్పడడం, ఎంతైనా మొదటి ప్రేమ కావడంతో మీరా పెళ్లి చేయడం కోసం చై స్పెయిన్ నుండి ఇండియాకి వస్తాడు.
కట్ చేస్తే.. మీరా-సిద్దార్ధ్ (ప్రిన్స్) పెళ్లి చేసే ప్రయత్నంలో చంద్రముఖి (లావణ్య త్రిపాటి) పరిచయం జరగడం.. ఆ తర్వాత కొన్ని చిత్రవిచిత్రమైన (చెప్పడానికి కుదరక అలా అనాల్సి వచ్చింది) చంద్రముఖితో చైకి నిశ్చితార్ధం జరగడం లాంటివి ఊహించని విధంగా జరిగిపోతాయి. మళ్ళీ కట్ చేస్తే.. చై చిన్నప్పుడే ఒక బలీయమైన కారణంగా దూరమైన తాత (నాజర్) కి మళ్ళీ దగ్గరవ్వడం.. తాత కోసం కర్ర సాము పోటీల్లో నెగ్గి ఊరు పరువు నిలబెట్టడం లాంటివి చకచకా జరిగిపోయి.. చై చివరికి తాను ప్రేమించిన మీరా కంటే తనను ప్రేమించిన చంద్రముఖిని పెళ్లి చేసుకోవడమే సబబు అని భావించి కోర్ట్ సాక్షిగా ప్రపోజ్ చేయడంతో సినిమా పూర్తవుతుంది.
నటీనటుల పనితీరు : కథ డిమాండ్ చేసిందో లేక దర్శకుడు శ్రీనువైట్ల కమాండ్ చేశాడో తెలియదు కానీ.. సినిమా మొత్తంలో రామ్ చరణ్ ని ఇమిటేట్ చేస్తూ.. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మేనరిజమ్ తో మేనేజ్ చేస్తూ అలా నెట్టుకొచ్చాడు వరుణ్ తేజ్. ఇక హీరోయిన్స్ అని పిలవబడే హెబ్బా పటేల్, లావణ్య త్రిపాటిలు కుదిరితే బొడ్డు లేదంటే యద ఎత్తులు కెమెరా లెన్స్ కి ఎలివేట్ చేస్తూ ఉండిపోవడం మినహా నటించడానికి స్కోప్ కూడా పెద్దగా లేకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు. ఇక హరీష్ ఉత్తమన్, నాజర్, మురళీశర్మ, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, ఆనంద్ ఇలా బోలెడు మంది ఆర్టిస్టులు వెండితెరపై నిలబడడానికే తప్ప కథకి కానీ కథనానికి కానీ ఏమాత్రం ఉపయోగపడకుండా సైలెంట్ గా స్క్రీన్ ప్రెజన్స్ వరకూ పరిమితమైపోయారు.
సాంకేతికవర్గం పనితీరు : “సుబ్రమణ్యం ఫర్ సేల్” లాంటి మాస్ సినిమాకి కూడా క్లాస్ టచ్ ఇచ్చి తన మార్క్ చేసిన సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ “మిస్టర్” విషయంలో మాత్రం దర్శకుడు శ్రీనువైట్ల చెప్పిన కథ అర్ధం కాకనో ఏమో ఇష్టమొచ్చినట్లు కొట్టేశాడు. బీజీయమ్ మాత్రం కాదు థియేటర్ బయటకొచ్చేసరికి ఒక్క పాట కూడా గుర్తుండదు. కె.వి.గుహన్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమాలో ప్లస్ పాయింట్. కూర్గ్, ఊటీ ప్రాంతాలను అందంగా చూపించాడు. చేజ్ షాట్స్, డ్రోన్ షాట్స్ బాగున్నాయి. సీన్ టు సీన్ కనెక్టివిటీ చూస్తే.. అసలు ఈ సినిమాకి ఎడిటర్ అనేవాడు ఉన్నాడా అనే సందేహం రాకమానదు.
ఇక సి.జి వర్క్, డి.ఐ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ తెలుగులో తెరకెక్కే బీగ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ కంటే ఘోరంగా ఉండడం గమనార్హం. గోపీమోహన్ రాసిన కథ, దానికి శ్రీధర్ సీపాన సమకూర్చిన సంభాషణలు ప్రేక్షకుడి సహనంతో ఫుట్ బాల్ ఆడుకుంటాయి. ముఖ్యంగా ఆ “శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పరిపాలన” ఎపిసోడ్ చూశాక ప్రేక్షకుడు దర్శకుడ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం ఖాయం.
దర్శకుడిగా శ్రీనువైట్ల స్థాయి “ఆగడు” చిత్రంతోనే దారుణంగా దిగజారింది. ఇక “బ్రూస్ లీ”తో శ్రీనువైట్ల కెరీర్ షెడ్డుకి వెళ్లిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాంటి శ్రీనువైట్లకి “మిస్టర్”తో వచ్చిన మరో అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఒక సినిమాని ఎలా తీయకూడదో అలా తీశాడు శ్రీనువైట్ల. ఇంతకుమించి శ్రీనువైట్ల పనితనం గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే.
విశ్లేషణ : సాధారణంగానే శ్రీనువైట్ల సినిమాల్లో కథ అనేది కనపడదు. ఏదో కామెడీతో నెట్టుకొచ్చేస్తుంటాడు. అలాంటిది “మిస్టర్” సినిమాలో ఆ కామెడీ కూడా లేకపోవడం.. పైపెచ్చు పిచ్చెక్కించే పనికిమాలిన ఎపిసోడ్స్ లెక్కకుమిక్కిలిగా ఉండడం వలన “మిస్టర్” వరుణ్ తేజ్ కెరీర్ లోనే కాక తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.