కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలక్షణ నటుడిగా 500 కి పైగా సినిమాల్లో నటించి రకరకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. గతంలో చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా చేయడంతో పాటు వాళ్ళకు పోటీగా సినిమాలు చేసి హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఘనత ఆయనది. అయితే మోహన్ బాబు హీరోగా చేసిన సినిమాల్లో చాలా వరకు ఆయన నిర్మించినవే కావడం విశేషం.
అయితే ఈయన నిర్మాత చేసిన సినిమాల్లో ఈయనకు నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. “నా కెరీర్ పరంగా చూసుకుంటే…. నాకు ఎప్పుడూ ఎవ్వరూ ఎలాంటి సాయం చేయలేదు. కష్టం వచ్చినప్పుడు .. నష్టం వచ్చినప్పుడు ప్రకృతి రూపంలో మాత్రమే నాకు సాయం అందింది. సినిమాలు చేసే నేను సంపాదించాను.
కొన్ని సినిమాలు నిర్మించడం వల్ల నష్టాలు వచ్చాయి.. దీంతో నాకు ఉన్న మంచి ఆస్తులు అమ్ముకున్నాను. మళ్లీ సంపాదించగలుగుతాను అనే ధైర్యంతో ముందుకు వెళ్లాను.ఫైనల్ గా అనుకున్నది సాధించగలిగాను. నా సీనియర్ హీరోలు సొంత బ్యానర్లు పెట్టడం చూసే నేను కూడా సొంత బ్యానర్ ను స్థాపించాను. కానీ ఎవ్వరినీ స్ఫూర్తిగా తీసుకోలేదు. నేను సొంత బ్యానర్ పెట్టడం దాసరి గారికి ఇష్టం లేదు. వీడు ఎక్కడ డబ్బులు పోగొట్టుకుంటాడో అనే ఒక భయం ఆయనకు ఉండేది.
అప్పట్లో నా సొంత బ్యానర్లో ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అయ్యేది. ఈ మధ్య కాలంలో మాత్రం అన్నీ ఫ్లాపులే. ఎక్కడో .. ఏదో తప్పు జరుగుతుంది. ఈ విషయంలో ప్రేక్షకులను తప్పు పట్టడానికి లేదు. ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా ఒక ప్రయోగం అని ముందే చెప్పాను. అందువలన ఆ సినిమా పోయినా నాకు పెద్ద బాధగా అనిపించలేదు. కానీ ‘జిన్నా’ ఎందుకు ఫెయిల్ అయిందనేది అర్థం కాలేదు” అంటూ చెప్పుకొచ్చారు.