ఎంతోమందికి ఇష్టమైన.. భారీ పోటీ నెలకొని ఉన్న చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం.. నిలదొక్కుకోవడం చాలా కష్టం. అటువంటిది డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా మంచి స్థాయికి చేరుకున్నారు. ముక్కుసూటిగా ఉంటూ ముందుకుసాగుతున్నారు. మోహన్‌బాబు సినీ ప్రస్థానం మొదలై 42ఏళ్లు అయిన సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదును కాకతీయ కల్చరల్ ఫెస్టివల్ వారు అందజేశారు. తనకు బిరుదును అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తన నట జీవితం ఎలా సాగిందో మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. “మా గురువు దాసరి నారాయణరావు గారు భక్తవత్సలం నాయుడును మోహన్‌బాబుగా మార్చారు. మహానటుడు అన్నయ్య బొబ్బిలిపులి గెటప్‌లో 1982లో కొబ్బరికాయ కొట్టి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ప్రారంభించారు. అన్నయ్య హీరోగా 1992లో మేజర్ చంద్రకాంత్ తీయడం నా అదృష్ణం.
నా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు.. బాంబ్ బ్లాస్టులు.. మరెన్నో కష్టాలు.. నష్టాలు.. ఉన్నాయి. తల్లిదండ్రుల.. భగవంతుని ఆశీస్సులు ఉండబట్టి.. ఈ రోజున మీ అందరి సమక్షంలో ఇలా ఉండి.. మా సుబ్బిరామిరెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునే శక్తినీ ఆ దేవుడు ప్రసాదించాడు.” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు మదన్ దర్శకత్వంలో గాయత్రి అనే సినిమా చేస్తున్నారు. మంచు విష్ణు, శ్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మించిన ‘గాయత్రి’ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల మందుకు రానుంది