గత కొన్నిరోజుల నుంచి మోహన్ బాబును, మోహన్ బాబు కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా మూవీ రిలీజ్ కాగా ఈ సినిమా టికెట్స్ బుకింగ్ బుకింగ్ విషయంలో, ఈ మూవీలోని గ్రాఫిక్స్ సన్నివేశాల విషయంలో తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. మంచు ఫ్యామిలీ మెంబర్స్ పరువుకు భంగం కలిగించేలా ఆ ట్రోల్స్ ఉండటం గమనార్హం. అయితే ట్రోల్స్ చేసేవాళ్లకు భారీ షాక్ ఇవ్వడానికి మంచు మోహన్ బాబు సిద్ధమయ్యారు.
సోషల్ మీడియాలో తమపై, తమ ఫ్యామిలీపై వచ్చే ట్రోల్స్ ను తొలగించని పక్షంలో 10 కోట్ల రూపాయల దావా వేస్తామని మంచు ఫ్యామిలీ హెచ్చరిక జారీ చేసింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి శేషు కుమార్ అనే వ్యక్తి మంచు ఫ్యామిలీని ట్రోల్స్ చేసేవాళ్లను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఒక లేఖను విడుదల చేశారు. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో మంచు ఫ్యామిలీ గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ట్రోల్స్ ను తక్షణమే తొలగించని పక్షంలో వ్యక్తిగత జీవితాలపై ఎటాక్ చేసినందుకు క్రిమినల్ కేసులను కూడా నమోదు చేస్తామని లేఖలో వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల సమయం నుంచి మంచు ఫ్యామిలీకి వ్యతిరేకంగా ట్రోల్స్ వైరల్ అయ్యాయి. ఇద్దరు హీరోలు తమను టార్గెట్ చేసి ట్రోల్స్ చేయిస్తున్నారంటూ మంచు మోహన్ బాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సన్నాఫ్ ఇండియా మూవీ రిలీజ్ తర్వాత ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి.
ట్రోల్స్ హద్దులు దాటడంతో మంచు ఫ్యామిలీ తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ హెచ్చరిక విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ట్రోల్స్ ను తొలగించని వాళ్లపై మంచు ఫ్యామిలీ నిజంగా చర్యలకు సిద్ధమవుతుందేమో చూడాలి.