సినిమా హీరోలకు బిరుదులు ఉంటాయి. చాలా ఏళ్లుగా వాళ్లను అలానే పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు లాంటి విషయాలు అందరికీ తెలియవు. వాళ్లకు వాళ్లే ఇచ్చుకున్నారేమో అని కొందరు అనుకుంటే, ఇంకొంరేమో అభిమానులు ఇచ్చి ఉంటారు అనుకుంటారు. ఈ విషయంలో చాలా రకాల వాదనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చర్చ అలా బిరుదులు పొందిన ఇద్దరు స్టార్ హీరోల గురించి, ఆ బిరుదు గురించి వచ్చిన చర్చ.
అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తెలుగులో సీనియర్ స్టార్ హీరోల మాదిరిగా కాకుండా తనదైన శైలిలో విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నారు. ఆయన సినిమాలను తెలుగు హీరోలు రీమేక్ చేద్దాం, కొత్తగా ఉంటుంది అని అనుకుంటున్నారు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా తనకున్న స్టార్ హీరో బిరుదు గురించి ప్రస్తావన వచ్చింది. ఆ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు ‘అవును కదా నిజమే’ అనే మాటను అనిపిస్తోంది.
మోహన్ లాల్ (Mohanlal) నటించిన ‘నెరు’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ భవిష్యత్తు, ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. అప్పుడు ‘మీరు, మమ్ముట్టినే మాలీవుడ్ లాస్ట్ సూపర్ స్టార్స్ అని అనుకోవచ్చా?’ అనే ప్రశ్న వచ్చింది. దానికి ఆయన చాలా కూల్‌గా చెప్పిన సమాధానం నేటితరం తారల పరిస్థితి, సినిమాల పరిస్థితిని వివరించింది.
నటులకు సూపర్ స్టార్ అనే టైటిల్‌ని ప్రేక్షకులు ఇస్తారు, ఉద్దేశపూర్వకంగా ఎవరూ తీసుకోలేరు. సినిమాల వల్ల ఎక్కువ విజయాలను అందుకున్నవారు సూపర్ స్టార్ అవుతారు. ఒకప్పుడు సినిమాలు సంవత్సరానికిపైగా థియేటర్లలో ఆడేవి. ఆకనీ ఇప్పుడు 90 రోజులు కూడా ఆడటం లేదు. దాంతో సూపర్ స్టార్ అనే పదం ఈ తరం నటుల విషయంలో వినిపించడంలేదు అని తన విశ్లేషణ చెప్పారు. ఒక విధంగా ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా అని నెటిజన్లు అంటున్నారు.