సాధారణంగా “బహుముఖప్రజ్ణాశాలి” అనే పదాన్ని చాలా సింపుల్ గా వాడేస్తుంటాం కానీ.. ఆ పదానికి అర్హురాలు స్వర్గీయ బి.జయ. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి రైటర్ గా, కార్టూనిస్ట్ గా, హ్యూమనిస్ట్ గా, డైరెక్టర్ గా ఆమె సంపాదించుకొన్న పేరు, అభిమానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిత్రపరిశ్రమలో టాప్ పి.ఆర్.ఓ అయిన బి.ఏ.రాజుతో వివాహం అనంతరం ఇండస్ట్రీకి మరింత దగ్గరైన బి.జయ మొన్న రాత్రి (గురువారం రాత్రి 9.30 గంటలకు) గుండెపోటుతో మరణించారు. ఆమె మరణంతో సినిమా ఇండస్ట్రీ మొట్టమొదటి మహిళా దర్శకురాలు (ఆమెకు ముందు భానుమతి, విజయ నిర్మల వంటి మహిళా దర్శకులున్నప్పటికీ.. వాళ్ళందరూ ఎవరి దగ్గర ఆసిస్టెన్స్ చేయకుండా సినిమా తీసినవాళ్లు) కోల్పోయింది. ఫిల్మ్ మీడియా ఫ్యామిలీ ఒక డేరింగ్ జర్నలిస్ట్ ను కోల్పోయింది.
జర్నలిస్ట్ గా, దర్శకురాలిగా కంటే వ్యక్తిగా జయ ఏర్పరుచుకున్న స్థానం గొప్పది. ఆమె పరిశ్రమ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అజాత శత్రువు. ఆమె మరణానికి చిత్ర పరిశ్రమ కంటే ఎక్కువగా బాధపడింది మాత్రం జర్నలిస్ట్ కుటుంబం. తమ కుటుంబంలోని ఒక వ్యక్తిని కోల్పోయినట్లుగా సినీ జర్నలిస్టులందరూ కన్నీరు పెట్టుకోవడం ఒక వ్యక్తిగా జయ సాధించిన ఘనత. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ.. వ్యక్తిగా మాత్రం ఎప్పటికీ అందరి మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకొన్న బి.జయ ఆత్మకి శాంతి చేకూరాలని “ఫిల్మీ ఫోకస్” మనస్ఫూర్తిగా కోరుకొంటోంది.