ఇప్పటివరకు సినిమా థియేటర్లు ఆ నలుగురు చేతిలోనే ఉన్నాయని ఇండస్ట్రీలో, మీడియా వర్గాల్లో వార్తలు వచ్చేవి. టాలీవుడ్ కి చెందిన టాప్ ప్రొడ్యూసర్స్ కొందరు థియేటర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని.. ఈ విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని గతంలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేసేవారు. అయితే ఇకపై ఇలాంటి ఆరోపణలు వినిపించవేమో. అసలు విషయంలోకి వస్తే.. కరోనాకి ముందు వరకు థియేటర్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు కరోనా వలన మరింత దారుణంగా తయారయింది.
భవిష్యత్తు మొత్తం ఓటీటీలదే అనిపిస్తున్న ఈ సమయంలో థియేటర్ వ్యవస్థ మళ్లీ పుంజుకోవడం చాలా కష్టమైనా విషయంగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్లన్నీ కూడా లీజు పద్దతిలోనే నడుస్తున్నాయి. థియేటర్లను గుత్తగా లీజు తీసుకొని.. వాటిని రెన్నోవేట్ చేసి.. హంగులు జోడించి ఇండస్ట్రీకి చెందిన పెద్దలు నడిపించుకుంటున్నారు. 2020లో సినిమాలు లేక థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. భవిష్యత్తులో ఎలా ఉంటుంది చెప్పలేం.
ఇలా ఖాళీగా థియేటర్లను మైంటైన్ చేస్తూ.. వర్కర్లకు జీతాలు ఇవ్వడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే లీజు అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేయించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో గుత్తేదార్లు ఉన్నారని సమాచారం. వైజాగ్ లో కొన్ని థియేటర్లు ఓ సినీ ప్రముఖుడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లీజు అగ్రిమెంట్లన్నీ రద్దు చేసే పనిలో ఆ నిర్మాత ఉన్నారని టాక్. ఆ లెక్కన.. థియేటర్లు ఇప్పుడు సొంతదార్లకే చెందుతాయి. థియేటర్లను లీజుకి తీసుకొని వాటిపై చాలా పెట్టుబడులు పెట్టారు గుత్తేదార్లు. కానీ ఇప్పుడు ఆ పెట్టుబడిని కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యారట. త్వరలోనే థియేటర్లన్నీ కూడా సొంతదార్ల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు!