దీపావళి పండుగ సీజన్ కి ఈ సారి బాక్సాఫీస్ వద్ద మంచి పోటీ కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెలాఖరున నాలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అందులో రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు కాగా, మరో రెండు అనువాద చిత్రాలు. ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా భిన్నమైన కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతున్నాయి. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా, వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందిన “లక్కీ భాస్కర్” (Lucky Baskhar) పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది.
90వ దశకంలో స్టాక్ మార్కెట్ లో జరిగిన ఓ పెద్ద స్కామ్ నేపథ్యంతో ఈ చిత్రం సాగనుంది. మామూలు బ్యాంక్ ఉద్యోగి జీవితంలో జరిగిన సంచలన మార్పులు, అతని కోటీశ్వరుడిగా మారిన ప్రయాణం ఇందులో చూపనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్. నాగ వంశీ (Suryadevara Naga Vamsi) నిర్మించిన ఈ సినిమా కోసం ముందే ప్రేక్షకులకి ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేశారు. అక్టోబరు 30న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 ప్రీమియర్ షోలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక, కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన “క” (KA) చిత్రం కూడా దీపావళి బరిలో ఉంది. సుజిత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. కొత్త పాయింట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఈ సినిమా ప్రత్యేకంగా పాన్ ఇండియా రిలీజ్ కోసం ప్లాన్ చేసినప్పటికీ, మొదట తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తమిళనాడులో ప్రస్తుతం థియేటర్ల కొరత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత నవంబరు 7న ఈ సినిమాను మిగిలిన భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక దీపావళి సందడిలో శివ కార్తికేయన్(Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi)జంటగా నటించిన “అమరన్” (Amaran) బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కథతో రూపొందిన కన్నడ డబ్బింగ్ మూవీ “బఘీర” కూడా బాక్సాఫీస్ పై రచ్చ చేసేలా వస్తోంది. రానున్న ఈ చిత్రాల రేంజ్ చూస్తుంటే దీపావళి బాక్సాఫీస్ పరిస్థితి రసవత్తరంగా మారనుంది.