సంక్రాంతి తర్వాత తెలుగులో సరైన రిలీజ్ లు లేక సినిమా లవర్స్ అందరూ ఢీలా పడిపోయారు. గతవారం విడుదలైన ‘ఛలో, టచ్ చేసి చూడు, హౌరా బ్రిడ్జ్’లలో ‘ఛలో’ మినహా మరో సినిమా ఏదీ ఆశించిన స్థాయిలో అలరించలేకపోవడం, చూడ్డానికి వేరే సినిమాలేమీ లేక బోర్ ఫీలైయ్యారు జనాలు. అలా డీలాపడిన వారికోసమే అన్నట్లుగా ఈవారం ఏకంగా మూడు క్రేజీ ప్రొజెక్ట్స్ రిలీజావుతున్నాయి. వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన “ఇంటిలిజెంట్” మాస్ మసాలా ఎంటర్ టైనర్ కావడం, “ఖైదీ నెం.150” తర్వాత వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ చిత్రంపై మాస్ మూవీ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే “ఫిదా” అనంతరం వరుణ్ తేజ్ నటించిన మరో లవ్లీ ఎంటర్ టైనర్ “తొలిప్రేమ” కూడా ఈవారం విడుదలవుతుంది. ప్రేమలోని భిన్న కోణాల్ని ప్రేక్షకులు ఆస్వాదించే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు హీరో టర్నడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి.
తొలుత ఈ చిత్రంపై అంచనాలే లేకపోయినప్పటికీ విడుదలైన ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను అమాంతం పెంచేసింది. ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ఫిబ్రవరి 10న విడుదలవుతుంది. ఈ రెండూ కాకుండా మోహన్ బాబు టైటిల్ పాత్ర పోషించిన “గాయత్రి” కూడా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఇంటెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మదన్ దర్శకుడు. ట్రైలర్ సినిమా మీద అంచనాలను బాగానే నెలకొల్పింది. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకొంటుందో చూడాలి. ఈ మూడు తెలుగు సినిమాలతోపాటు హిందీ చిత్రం “ప్యాడ్ మ్యాన్” కూడా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. “ప్యాడ్ మ్యాన్ చాలెంజ్” పుణ్యమా అని విశేషమైన క్రేజ్ దక్కించుకొన్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ టైటిల్ పాత్ర పోషించగా.. రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ కథానాయికగా నటించారు. బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సో ఈ శుక్రవారం, శనివారం మూవీ లవర్స్ కి పండగ అన్నమాట. మరి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు భేష్ అనిపించుకొంటాయి, ఏ సినిమాలు తుస్ మంటాయో చూడాలి…