మృణాల్… ఈ పేరు మనకు బాగా పరియం అయ్యింది అంటే కారణం సీత. ఆ పాత్రతోనే మృణాల్‌ను ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. అంతలా ‘సీతారామం’ సినిమాలో సీతగా మెప్పించింది మరి. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో మృణాల్ స్టైల్ మార్చేసింది. ‘మా సీత ఇలా ఉండదు’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రెండు రకాలుగా ఇంత పేరు తెచ్చుకున్న మృణాల్ ఇప్పుడు తనను మరచిపోయినా ఫర్వాలేదు అంటోంది. అంతలా అనడానికి కూడా ఓ కారణం ఉంది.
సీతగా ఇన్నాళ్లూ అందరికీ గుర్తున్న మృణాల్ ఇప్పుడు యష్ణ అవతారం ఎత్తింది. నాని హీరోగా రూపొందిన ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆమె పోషించిన పాత్ర అది. ఆ పాత్ర గురించి గొప్పగా చెబుతూనే తనను మరచిపోయినా ఫర్వాలేదు అని చెప్పింది. దీంతో ఎందుకు అలా అంది అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకులకు చేరువయ్యా. అలాంటి బలమైన పాత్ర చేస్తున్నానంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. అదే ఈ యష్ణ పాత్ర అని చెప్పింది.
‘హాయ్ నాన్న’ సినిమాలో భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ఈ కథ హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు మిళితం. సినిమా పేరును చూసి ఇది తండ్రీ కూతుళ్ల కథ అనుకుంటే పొరపాటే. ఇందులో మానవీయ బంధాలన్నింటినీ చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. సినిమాలో అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది అని కూడా చెప్పింది. ఇక ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది మృణాల్ అని అడిగితే… మృణాల్ ఠాకూర్‌ను (Mrunal Thakur) ప్రేక్షకులు గుర్తు పట్టకపోయినా ఫర్వాలేదు కానీ నా పాత్రలు గుర్తుండాలి అని చెప్పింది.
ఇక వరుసగా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు కదా… ఏం గమనించారు అని అడిగితే.. నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మంచి సహ నటులు. తమతో నటించేవారికి ఎప్పుడూ స్నేహం అందిస్తారు, మంచి నటను ప్రదర్శించేందుకు సాయం చేస్తారు అని చెప్పింది. అన్నట్లు మృణాల్ చెప్పిన ‘హాయ్ నాన్న’ ఈ నెల 7న విడుదలవుతోంది.