భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - మురాడ్ కేతాని - ప్రణయ్ రెడ్డి వంగా (Producer)
హర్షవర్ధన్ రామేశ్వర్ (Music)
అమిత్ రాయ్ (Cinematography)
Release Date : డిసెంబర్ 01, 2023
“అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్” బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “యానిమల్”. రణబీర్ కపూర్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ట్రైలర్ విడుదలయ్యాక సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మరి సందీప్ ఆ అంచనాలను అందుకోగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్) చిన్నప్పట్నుంచి తండ్రి మీద విపరీతమైన ప్రేమతో పెరుగుతాడు. తండ్రి తర్వాత తన కుటుంబానికి అన్నీ తానై చూసుకోవాలనుకుంటాడు. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అతడి ప్రేమ మెల్లమెల్లగా డామినేషన్ గా రూపాంతరం చెందుతుంది. తండ్రి వెళ్లిపోమాన్నాడని తాను ప్రేమించిన గీతాంజలి (రష్మిక మందన్న)ను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళి స్థిరపడతాడు విజయ్.
కట్ చేస్తే.. ఢిల్లీలో తన తండ్రిపై గన్ అటాక్ జరిగిందని తెలుసుకొని ఇండియాకి కుటుంబంతో తిరిగి వచ్చేస్తాడు. అప్పట్నుంచి తన తండ్రిపై అటాక్ చేసింది ఎవరు? అనేది కనిపెట్టడం కోసం విశ్వప్రయత్నం చేస్తుంటాడు. అసలు బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) మీద దాడి చేసింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? వారి మీద విజయ్ ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది “యానిమల్” కథాంశం.
నటీనటుల పనితీరు: ఇప్పటివరకూ రణబీర్ కపూర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే అందరు “రాక్ స్టార్” అనేవారు. “యానిమల్” ఇప్పుడు ఆ స్కేల్ ను మార్చేసింది. ఒక నటుడిగా రణబీర్ కపూర్ పూర్తిస్థాయి పొటెన్షియల్ ను యూజ్ చేసుకున్న సినిమా ఇది. అతడిలోని భిన్నమైన ఎమోషన్స్ ను చాలా స్ట్రాంగ్ గా చూపించారు. ఒక నటుడిగా రణబీర్ కపూర్ లోని క్రోధాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసిన పాత్ర రన్ విజయ్ సింగ్ బల్బీర్.
ఈ సినిమా/పాత్ర నుండి అతడు బయటకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు, లేదా ప్రేక్షకులు మళ్ళీ అతడ్ని ఒక సాధారణ నటుడిలా యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ.. రణబీర్ కపూర్ కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాత్ర/సినిమాగా “యానిమల్” మిగిలిపోతుంది. రష్మిక మందన్న నటిగా తేలిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే 15 నిమిషాల ఎమోషనల్ సీన్ లో ఆమె నటన, డైలాగ్ డెలివరీ చాలా పేలవంగా ఉంది. నటిగా ఆమెకు ఈ సినిమా ఏమైనా ప్లస్ అవ్వోచ్చేమో కానీ..
ఆమె మాత్రం ఈ సినిమాకి ఎలాంటి వేల్యూ యాడ్ చేయలేకపోయింది. ఇంకా చెప్పాలంటే జోయా పాత్రలో నటించిన త్రిప్తి దిమ్రీ తక్కువ స్క్రీన్ టైమ్ తో ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. బాబీ డియోల్ నుంచి ఇంకాస్త ఎక్కువ స్క్రీన్ టైమ్ ఊహిస్తామ్. కానీ.. ట్రైలర్ లో చూపించిన షాట్స్ తోనే ముగించేశాడు. అందువల్ల ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన పాత్ర కొంత మేరకే మిగిలిపోయింది. అనిల్ కపూర్, శక్తి కపూర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మరో హీరో అని చెప్పాలి. తన నేపధ్య సంగీతంతో అతడు సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ & సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ డ్రామా సీన్స్ ని అతడు సౌండ్ డిజైన్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఏ సన్నివేశానికి సంగీతం, ఏ సన్నివేశానికి సైలెన్స్ అవసరం అని జడ్జ్ చేయగలగడం కూడా ఒక గొప్ప పనితనం. ఈ సినిమా తర్వాత అతడికి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం.
అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ వర్క్ మరో ఎస్సెట్ గా నిలిచింది. కొన్ని యాక్షన్ సీన్స్ లో సీజీ వర్క్ కి స్కోప్ లేకుండా చాలా నేచురల్ గా పిక్చరైజ్ చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా రణబీర్-బాబీల ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేసిన విధానం మంచి హై ఇస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అవసరానికి మించి ఖర్చు చేశారనే చెప్పాలి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ముందుగా చెప్పినట్లే అత్యంత వైల్డ్ సినిమా ఆడియన్స్ కు అందించాడు. ఎమోషన్స్, యాక్షన్, సెంటిమెంట్స్ అన్నీ పీక్ లెవల్లో ఉంటాయి. కబీర్ సింగ్ లోని మేల్ ఈగోకి బాబు లాంటి ఆల్ఫా (ALPHA) క్యారెక్టర్ రణ్ విజయ్ సింగ్ ది. రణబీర్ కపూర్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో వాడుకోవడమే కాక.. మిగతా పాత్రలను జస్ట్ సైడ్ క్యారెక్టర్స్ లా కాకుండా, కథనానికి సరిగ్గా ఉపయోగపడేలా డిజైన్ చేసిన విధానం బాగుంది. ఇక ఫెమినిస్టులు డిస్కస్ చేసుకోవడానికి బోలెడంత స్టఫ్ ఇచ్చాడు కూడా. అయితే.. సందీప్ రెడ్డి దర్శకుడిగా తన బలాన్ని చూపించింది మాత్రం తండ్రీకొడుకుల సెంటిమెంట్ సీన్స్ తో.
ముఖ్యంగా చివరి 10 నిమిషాల రణబీర్-అనిల్ కపూర్ ల సంభాషణ & పోస్ట్ క్రెడిట్ సీన్ తో సీక్వెల్ మరింత క్రూరంగా ఉండబోతోందని చూపించాడు. సెకండాఫ్ లో జోయా పాత్ర మాత్రం కొందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. ముఖ్యంగా ఆ పాత్రతో జరిపే శృంగార సన్నివేశాలు చర్చనీయాంశమవుతాయి. “అర్జున్ రెడ్డి”తో కథకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న సందీప్.. “యానిమల్”తో దర్శకుడిగా, ఎడిటర్ గా ఎక్కువ మార్కులు కొట్టాడు. సన్నివేశాల ట్రాన్సిషన్ & మూడ్ బట్టి సెట్ చేసిన కలర్ థీమ్ & డి.ఐ టెక్నీషియన్ గా అతడి ప్రతిభను చాటింది.
విశ్లేషణ: ఎవ్వరూ ఊహించని స్థాయిలో (Animal) “యానిమల్” ఉంటుంది. రణబీర్ నట విశ్వరూపం, హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. “దునియా జలదేంగే” పాట ప్లేస్మెంట్ & ఎండ్ క్రెడిట్స్ సినిమాకి మంచి కిక్ ఇస్తాయి. పిల్లలకు పొరపాటున కూడా చూపించకుండా పెద్దలు కుదిరినన్నిసార్లు చూడొచ్చు. మంచి వైల్డ్ ఎమోషనల్ రైడ్ ఈ సినిమా.