మృణాల్ ఠాకూర్.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు అందరికీ తెలిసింది అంటే.. దానికి కారణం సీతా మహాలక్ష్మి. ‘సీతా రామం’ సినిమాలో ఆమె చేసిన ఆ పాత్రకు చాలా మంది పేరొచ్చింది. చాలామంది హీరోయిన్లలాగే ఆమె ప్రస్తుతం అందుకుంటున్న స్టార్ నటి స్టేటస్ వెనుక చాలా కష్టాలున్నాయి. ఎదుర్కొన్న అవమనాలూ ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆమె ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకుందట. ఇంతకీ ఏమైందంటే? ఇంటర్ అయిపోయాక మృణాల్ ఠాకూర్ డెంటిస్ట్ అవుదాం అనుకుందట.
బీడీఎస్ చేద్దామని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకు కూడా తెచ్చుకుందట. కానీ, కొన్ని రోజులకు ఆమెకు మీడియాలోకి వెళ్లాలని అనిపించిందట. దీంతో తల్లిదండ్రులను ఒప్పించి బ్యాచిలర్స్ ఇన్ మాస్ మీడియా (BBM)లో చేరిందట. అక్కడికి కొద్ది రోజుల వాళ్ల నాన్నకు బదిలీ అవ్వడంతో ముంబయిలోనే ఉండి చదువుకోవాల్సి వచ్చింది మృణాల్‌కి. ఆ సమయంలో ఒకవైపు ఒంటరితనం, మరోవైపు నాన్నని బాధపెడుతున్నానన్న ఆలోచనతో చదువు మీద దృష్టి పెట్టలేకపోయిందట. ఇంకోవైపు మీడియా రంగం తనకు కరెక్ట్ కాదని అనిపించిందట.
ఈ క్రమంలో బుర్రలో రకరకాల ఆలోచనలతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట మృణాల్. కొన్నిసార్లు అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచనలు కూడా వచ్చాయట. ఓసారి లోకల్ ట్రైన్‌లో కాలేజీకి వెళ్తుంటే అందులోంచి దూకేయాలని అనిపించేదట. అయితే, తను ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులు తట్టుకోలేరని సమస్య నుండి బయటపడే ప్రయత్నాలు చేసిందట. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చిందట. చదువుకుంటూనే మోడలింగ్ వైపు వచ్చింది. ఈ క్రమంలో ఓ షోలో మృణాల్‌ను చూసిన ఓ డైరక్షన్ టీమ్ 2012లో ‘ముఝే కుఛ్ కెహ్‌తీ హై ఖామోషియా’ అనే సీరియల్‌లో అవకాశమిచ్చారట.
ఆ తరవాత వచ్చిన ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్‌తో హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మృణాల్‌కు పేరొచ్చింది. సీరియళ్లు చేస్తూనే సినిమా ఆడిషన్స్‌కూ వెళ్లేదట. అలా చాలా ప్రయత్నాలు చేశాక సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’లో అవకాశం వచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఛాన్స్ పోయిందట. అప్పుడే ‘లవ్ సోనియా’ ఆడిషన్‌కి పిలిచారట. అందులో సెలక్ట్ అయ్యి.. నటిగా సినిమా జీవితం ప్రారంభించింది మృణాల్.