Ilaiyaraaja: ఇళయరాజా ‘హక్కులు’… అసలేంటిది? ఎందుకింత రచ్చ? ఎప్పటికి తేలుతుంది?

  • May 26, 2024 / 11:18 PM IST

పాటల కాపీ రైట్స్ విషయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja)  అనుసరిస్తున్న శైలిపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. తను స్వరపరిచిన సినిమాల్లోని పాటల్ని ఎక్కడైనా ప్లే చేసినా, ఎవరైనా వాడినా.. వెంటనే ఆయన టీమ్‌ యాక్టివేట్ అయిపోతోంది. నోటీసులు ఇచ్చేస్తోంది. తాజాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) సినిమా టీమ్‌కు ఇళయరాజా టీమ్‌ నుండి నోటీసులు వచ్చాయి. దీంతో అసలేంటి వ్యవహారం అంటూ చర్చ జరుగుతోంది. ఏదైనా సినిమాకు సంగీతం అందించినప్పుడు సంగీత దర్శకుడికి పారితోషికం ఇస్తారు.

ఆ తర్వాత ఆ పాటలు నిర్మాతవే అవుతాయి. వాటికి సంబంధించిన హక్కులను విక్రయిస్తారు నిర్మాత. అయితే తాను కంపోజ్‌ చేసే పాటలకు తానే మొదటి హక్కుదారు అనేది ఇళయరాజా వాదన. అందుకు తగ్గట్టే ఆయన ఎకో, సోనీ అనే సంస్థలతోపాటు తన సొంత కంపెనీ ఐఎంఎంకి హక్కులు ఇచ్చేశారు. ఈ క్రమంలో ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ సినిమా టీమ్‌కి ‘గుణ’ సినిమా పాట గురించి నోటీసులు ఇచ్చారు. అయిఇతే ‘గుణ’ సంగీత హక్కులు ఉన్న పిరమిడ్ మ్యూజిక్ నుండి ‘మంజుమ్మెల్‌ బాక్స్‌’ టీమ్‌ పాట హక్కులు కొని వాడుకుంది.

ఈ విషయం తెలిసో లేక తెలియకో కానీ ఇళయరాజా టీమ్‌ నోటీసు ఇచ్చింది. ఎందుకు అని అడిగితే పాట గురించి ఇళయరాజాని కనీసం అడగలేదన్నది పాయింట్ అట. డబ్బులు ఇవ్వమని డిమాండ్ కాదట. హక్కులు కొనుక్కున్నాక మళ్లీ అడగడం ఏంటి అనేది ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ టీమ్‌ ఆలోచన కాబోలు. ఇక హక్కుల సంగతి ఏంటి అని చూస్తే.. 1957 కాపీ రైట్స్ చట్టం ప్రకారం పాటలకు, సంగీతానికి సంగీత దర్శకుడు యజమాని అయినప్పటికీ..

సెక్షన్ 17 ప్రకారం నిర్మాతే అసలు ఓనర్‌. 2012లో చేసిన సవరణ ప్రకారం పాట మీద వచ్చే ఆదాయం గీత రచయితతోపాటు ఆ పాట కోసం కష్టపడ్డ అందరికీ అందాలనే వెసులుబాటు ఉంది. దీన్ని అమలుచేయడానికి ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్ (ఐపిఆర్ఎస్) ఏర్పాటు చేశారు. నిర్మాతకు 50 శాతం ఆదాయం దక్కి..

మిగిలిన సగం సంగీత దర్శకుడు, గీత రచయి, గాయనీగాయకులకు వచ్చేలా చూడటం ఐపిఆర్ఎస్ బాధ్యత. అయితే ఇందులో సభ్యత్వం తీసుకుంటనే పై పని జరుగుతుంది. ఇందులో ఇళయరాజా సభ్యులు కాదు. సభ్యత్వం లేకపోయినా ఆదాయం నుండి వాటా పొందే హక్కు ఉంటుంది. ఇన్ని మెలికలు ఉండటంతో ఈ విషయం తేలడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus