తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న సంస్థలలో మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఒకటి. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లను నిర్మించడంతో పాటు, పెద్ద హీరోల సినిమాలు లైన్‌లో పెట్టిన సంస్థగా మైత్రి ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతోంది. నిర్మాణ స్థాయిలో టాప్ పొజిషన్ దక్కించుకున్న ఈ సంస్థ ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లో కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణలో తమ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.
Mythri Movie Makers
కొత్తగా సొంత థియేటర్లను నిర్మించడమే కాకుండా, పాత సింగిల్ స్క్రీన్ థియేటర్లను కొనుగోలు చేయడం లేదా భాగస్వామ్యం చేసుకుంటూ వాటిని ఆధునిక సౌకర్యాలతో మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌ను రీనోవేట్ చేసి ప్రజలను ఆకట్టుకున్న ఈ సంస్థ, మరిన్ని ప్రాంతాల్లో కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరీంనగర్‌లోని శివ థియేటర్‌ను ఇటీవల తీసుకుని సరికొత్త లుక్‌తో రీడిజైన్ చేసింది.
ఈ థియేటర్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సమయంలో ఈ థియేటర్‌లో భారీ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, మరోవైపు ఘట్కేసర్ జగదాంబ థియేటర్, దేవరకొండ శ్రీ వెంకటేశ్వర వంటి కొన్ని ప్రముఖ థియేటర్లు ఇప్పటికే మైత్రి ఆధీనంలోకి వచ్చాయి. తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మరిన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లను కొనుగోలు చేయడానికి లేదా వాటి యజమానులతో భాగస్వామ్యం చేసుకునే దిశగా మైత్రి ముందుకు సాగుతోంది.
థియేటర్ రంగంలో ప్రస్తుతం ఏషియన్ సంస్థ, దిల్ రాజు (Dil Raju) బ్యానర్ పెద్ద వ్వవస్థలుగా కొనసాగుతున్నాయి. అయితే మైత్రి (Mythri Movie Makers) సంస్థ కూడా ఈ పోటీకి సిద్ధమవుతూ తనదైన మార్క్ చూపించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. 2025 నాటికి మరిన్ని థియేటర్లను నిర్మించి, ఆధునిక సాంకేతికతతో మెరుగుపరచలనే లక్ష్యంతో మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వెళ్తోంది.