ఆమిర్ ఖాన్ -అద్వైత్ చందన్ కాంబినేషన్లో ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు టీం గతేడాదే వెల్లడించింది. అయితే ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్ లో నాగ చైతన్య ఎక్కువసేపు కనిపించకపోయేసరికి అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. సినిమాలో ప్రాముఖ్యత లేని పాత్ర కోసం చైతన్య ని తీసుకున్నారా..? అంటూ అభిమానులు మండి పడ్డారు.
అయితే ఇటీవల చైతన్య పాత్ర పేరును రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. బాలరాజు అనే పాత్రలో చైతన్య కనిపించబోతున్నట్టు తెలియజేసారు. అంతేకాదు ఈ చిత్రంలో చైతన్య పాత్ర ఎలా ఉండబోతుంది, లుక్స్ ఎన్ని ఉంటాయి వంటి విషయాలు తెలుపుతూ కూడా ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘లాల్ సింగ్ చద్దా’ లో చైతన్య 3 రకాల లుక్స్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒక లుక్ లో తన తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారి వలే కనిపిస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.
ఈ వీడియోలో నాగ చైతన్య మాట్లాడుతూ.. “ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర పేరు బాల అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని బోడిపాలెం అనే ఊరు నుండి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా నేను కనిపిస్తాను. చాలా మంది పేర్ల ముందు ఇంటి పేర్లు, ఊరు పేర్లు జతచేసి ఉంటాయి.అలాగే ఇందులో కూడా బాలరాజు పేరు పక్కన అతని ఊరి పేరు బోడిపాలెం జత చేయడం జరిగింది. ఈ పేరును ఆమిర్ సర్‌తో సహా చిత్ర బృందం మొత్తం ఫైనల్ చేసింది.
ఇదే పేరుతో తాత గారి సినిమా పేరు ‘బాలరాజు’ కూడా ఉండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ అయిపోయిందని డైరెక్టర్ చెప్పడంతో చాలా బాధపడ్డాను. షూటింగ్ జరిగినన్ని రోజులు నన్ను నేను మర్చిపోయాను. కొత్త ప్రపంచాన్ని చూశాను. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను’ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.