వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన “ఛలో” సూపర్ హిట్ అయింది. చాలా కాలం తర్వాత విజయం అందుకోవడంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. నాగశౌర్య తాజాగా సుందర్ సూర్య దర్శకత్వంలో నటించిన మూవీ ‘అమ్మమ్మగారిల్లు’. శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో కె.ఆర్, రాజేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ టీజర్ ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ టీజర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ”అమ్మమ్మగారిల్లు ఒక గుడిలాంటిది. గుడికి వెళ్లినప్పుడు శత్రువులు ఎదురైనా దర్శనం చేసుకుని వస్తాంగానీ.. అలాంటి చోట గొడవలు పడం.
అలాగే అమ్మమ్మగారి ఇంటికెళ్లినప్పుడు కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్ఫర్ధలున్నా బయటకి నవ్వుతూ ఉంటాం. కారణం అమ్మమ్మ బాధపడకూడదని. అలాంటి పాత్రలతో చిత్రీకరించిన సినిమా ఇది. నాకు మా అమ్మమ్మ వాళ్ల ఇంటితో చాలా అనుబంధం ఉండేది. మళ్లీ ఆ జ్ఞాపకాలన్నీ ఈ సినిమా గుర్తుచేసింది. సినిమా బాగా వచ్చింది. ఇవి రేటింగ్ ఇచ్చే సినిమాలు కావు. దయచేసి ఎవరూ ఈ సినిమాకు రేటింగ్స్ ఇవ్వొద్దని కోరుకుంటున్నా.” అని రివ్యూ రైటర్స్ ని కోరారు. తన కోస్టార్ షామిలీ గురించి మాట్లాడుతూ…. “షామిలీ 15 ఏళ్ల క్రితమే నటిగా నిరూపించుకున్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనూ ఆమె సహజమైన నటనతో ఆకట్టుకుంటుంది” అని అభినందించారు. ఈ సినిమాతో పాటు నాగశౌర్య సొంత బ్యానర్లోనే మరో సినిమాకి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో “నర్తనశాల” అనే చిత్రం చేస్తున్నారు.