నెపోటిజం ప్రతి రంగంలోనూ ఉన్నా… ఎక్కువగా విమర్శలు వచ్చే రంగం సినిమా రంగం. తారల కుటుంబ సభ్యులకు సినీ రంగ ప్రవేశం కేక్ వాక్ అని అందరూ అంటుంటారు. నెపోటిజం వల్లే ఇది సాధ్యమవుతోందని విమర్శిస్తుంటారు. పెద్ద పెద్ద స్టార్లను టార్గెట్ చేస్తూ… చాలామంది విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసేవాళ్లలో ఏమీ లేకుండా వచ్చి.. స్లార్లగా ఎదిగిన నటులు కూడా ఉన్నారు. తాజాగా ఈ విమర్శలపై ప్రముఖ నటుడు నాగార్జున స్పందించారు. తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
“నెపోటిజం పదాన్ని చాలా తప్పుగా వాడుతున్నారు. ప్రజల డబ్బులతో నడిపే సంస్థలలో వారసులకు, బంధువులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని నెపోటిజం అంటుంటారు. ప్రయివేట్ రంగంలో వ్యక్తులకు ఇది వర్తించదు. నాన్న నాగేశ్వరరావు గారు సినిమాల్లో రాణించారు. మమ్మల్ని బాగా చదివించారు. నేను సినిమాల్లోకి వస్తానని పట్టుబడితే తీసుకొచ్చారు. నా పిల్లలకూ ఈ రంగంలో ఆసక్తి ఉందంటే తీసుకొచ్చాను. కొడుకుల కోసం కష్టపడటంలో తప్పేముంది. వాళ్లను ప్రోత్సహించడం తప్పా. అలాగే బయటి వ్యక్తుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు ఇస్తాం. ఇంతకుమించి నెపోటిజం గురించి ఏం చెప్పలేను” అని నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి కంగనా రనౌత్ స్పందించిన ఒకటి రెండు రోజుల్లో నాగార్జున స్పందించడం గమనార్హం. సౌత్‌లో నెపోటిజం ఉన్నప్పటికీ, గ్రూపిజం, గ్యాంగిజం లేవని చెప్పుకొచ్చింది. కొత్తవాళ్లను ఆదరిస్తారు అని కూడా చెప్పింది. ఇప్పుడు నాగ్ అసలు నెపోటిజం సినీ ఇండస్ట్రీకి వర్తించదు అని అంటున్నాడు. మరి ఎప్పట్లా కంగన స్పందిస్తుందో లేక ఆమె స్పందన బాలీవుడ్ కామెంట్లకు మాత్రమే పరిమితం చేస్తుందో చూడాలి.