టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఇద్దరు కొడుకులు హీరోలుగా నటిస్తున్న ఈ జెనరేషన్ లో కూడా నాగ్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. దాన్ని బట్టి ఆయన క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా సరికొత్త కథల్లో నటించడానికి ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఐతుంటారు. ఇప్పటికే చాలా మంది కొత్త దర్శకులు, టెక్నీషియన్స్ ను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని టాలీవుడ్ కి పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సీనియర్ హీరో. నాగార్జున చివరిగా ‘ది ఘోస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో నాగార్జున కొంత గ్యాప్ తీసుకొని కథలు విన్నారు. రీసెంట్ గా ఆయనకి ఒక కథ బాగా నచ్చింది. రైటర్ ప్రసన్న కుమార్ ఆ కథను రాశారు.
ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలా..? అని ఆలోచించి ఫైనల్ గా ప్రసన్న కుమార్ కే దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. చాలా కాలంగా డైరెక్టర్ కావాలని ఎదురుచూస్తోన్న ప్రసన్నకు ఇది మంచి ఛాన్స్. అందుకే వెంటనే ఓకే చెప్పేశారు. అయితే ఇదొక రీమేక్ కథ అని తెలుస్తోంది.
2019లో విడుదలైన మంచి సక్సెస్ సాధించిన ‘పొరింజు మరియం జోస్’ అనే సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి నాగార్జునకు వినిపించారు ప్రసన్న కుమార్. ఈ సినిమాను నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిచనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.