సినిమా పరిశ్రమ అంతా ఒకవైపు.. ఇళయరాజా ఒకవైపు అని అంటుంటారు. ఆయన ప్రతిభ వల్ల తొలుత ఇలా అంటే.. ఆ తర్వాత ఆయన పెడుతున్న కేసుల గురించి మాట్లాడుతూ అలా అంటున్నారు. తన అనుమతి లేకుండా తన పాత సినిమాల్లోని పాటల్ని కొత్త సినిమాల్లో వినియోగించడంపై ఆయన గత కొన్నేళ్లుగా ఆయన కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా మద్రాసు హైకోర్టులో ఇలాంటి ఓ కేసు విషయంలో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో హైకోర్టు అడిగిన కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
తన అనుమతి లేకుండా తన పాటలు ‘డ్యూడ్’ సినిమాలో వినియోగించారని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ ఇటీవల విచారించారు. ఈ క్రమంలో సినిమా థియేటర్‌లో విడుదలైనప్పుడు మాట్లాడకుండా.. ఓటీటీలోకి వచ్చాక అందులో నా పాటలు వినియోగించారంటూ ఎందుకు కేసు వేశారు? అని ఇళయరాజా తరఫు లాయర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. 30 ఏళ్ల నాటి పాటలను నేటి తరం ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తున్నారని, వాటి వల్ల ఇళయరాజా ఏ విధంగా ప్రభావితం అవుతారని దర్శకుడి తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

ఇళయరాజా అనుమతి లేకుండా, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించేలా పాటలను ‘డ్యూడ్’ సినిమాలో వినియోగించారని.. ఆ పాటల రైట్స్ తమ వద్ద ఉన్నాయి కాబట్టి సినిమా నుంచి ఆ పాటలను తొలగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఇళయరాజా న్యాయవాది కోరారు. దీంతో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇళయరాజా పాటలను తరచూ సినిమాల్లో ఎందుకు ఉపయోగిస్తున్నారని నిర్మాణ సంస్థ లాయర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.
దానికి ఆ నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పాటల రైట్స్‌ను ఎకో సంస్థ నుంచి సోనీ సంస్థ పొందిందని, ఆ పాటలను సినిమాలో ఉపయోగించేందుకు సోనీ నుంచి అనుమతి పొందినట్లు మైత్రీ మూవీ మేకర్స్ తరఫున చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.
