సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్ అందుకుంటున్న నయనతార (Nayanthara) తన కెరీర్‌లో ఎన్నో బిగ్ హిట్స్ చూసింది. తన ప్రయాణం ఎత్తుపల్లాలతో నిండినదైనా, ఆత్మవిశ్వాసంతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా నయనతార జీవితంలో జరిగిన కొన్ని విశేషాలను నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచానికి అందించారు. “నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్స్” అనే డాక్యుమెంటరీలో ఆమె వ్యక్తిగత, వృత్తిగత జీవితంలోని ఎన్నో విశేషాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా నయనతార ప్రేమ సంబంధాల గురించి ఆమెను ప్రశ్నించగా, చాలా ఓపెన్‌గా స్పందించింది.
నయనతార తన గత సంబంధాల గురించి చర్చిస్తూ, వాటి కారణంగా ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది. ఫస్ట్ రిలేషన్‌లో నమ్మకంతో ముందుకు సాగినా, అనుకోని కారణాలతో అది విఫలమైందని చెప్పింది. బ్రేకప్ తర్వాత అమ్మాయిలపైనే అన్ని విమర్శలు వస్తాయనే బాధను కూడా వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీలో కింగ్ నాగార్జున (Nagarjuna) నయనతార గురించి షేర్ చేసుకున్న కొన్ని విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కెరీర్ ఆరంభంలో నయనతార నాగార్జునతో ‘బాస్’ (Boss) చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
అప్పుడు సెట్‌లో ఆమె కనిపించిన తీరు, నడవడిక, మాటతీరు చాలా ప్రత్యేకంగా అనిపించాయని నాగార్జున తెలిపారు. అయితే అప్పుడు నయనతార ఓ ప్రేమ బంధంలో ఉండడం, ఆ బంధం ఆమె మనసుకు ఇబ్బంది కలిగించినట్లు నాగార్జున గమనించినట్లు చెప్పారు. “ఆమె టెన్షన్‌తో ఉండేది. ఫోన్ రింగ్ అయితే వెంటనే ఆందోళన చెందేది. నేనడిగితే, ‘ఇది నిజమైన ప్రేమ’ అని చెప్పింది. కానీ ఆ బంధం ఆమెకు ఆనందం కలిగించలేదని అర్థమైంది.
జీవితంలో ఎదగాలంటే వర్రీ అవుతూ ఉండటం వద్దు అని సలహా ఇచ్చాను,” అని నాగార్జున ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు. నయనతార ఇప్పుడు కెరీర్ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా బలపడిన మహిళగా నిలిచిందని నాగ్ అన్నారు. గత అనుభవాలు ఆమెను మరింత మెల్లగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా మార్చాయని అనిపిస్తుంది. నాగార్జున (Nagarjuna) చెప్పిన ఆమె జీవితంలోని ఘట్టాలు ఆమె వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించాయి.