చిత్ర పరిశ్రమలో నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఓ లారీతో జీవిత ప్రయాణం సాగించే కుటుంబంలో జన్మించిన వాడు సినిమాల్లోకి రావడం, నిర్మాతగా మారటం.. చూస్తుంటే సినిమా కథలా ఉన్నా ఇది వాస్తవం. మామ బెల్లంకొండ సురేష్ వల్ల అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి నిర్మాతగా పలు విజయాలు అందుకున్న “నల్లమలుపు శ్రీనివాస్”(బుజ్జి) జీవితంలోని కొన్ని అనుభవాలను ఓ ప్రముఖ పత్రికతో పంచుకున్నారు.
పరిశ్రమకి అడుగుపెట్టిన కొత్తల్లో దర్శకుడు వినాయక్ తో పరిచయం అయ్యిందని బుజ్జి చెప్పారు. వినాయక్ అప్పట్లో ప్రేమకథలు బాగా రాసేవారని, అవన్నీ మణిరత్నం శైలిలో ఉండేవని, అలా సిద్ధం చేసిన ఓ కథనే ఎన్టీఆర్ కు వినిపించగా మాస్ కథతో రమ్మనమని చెప్పడంతో ‘ఆది’ రూపు దిద్దుకుందన్నారు. తర్వాత ఆకుల శివ కథతో వినాయక్ తెరకెక్కించిన ‘లక్ష్మి’ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక శ్రీవాస్ రాజకీయ నేపథ్యంలో ఓ కథ చెప్పగా దానికి మార్పులు చేర్పులు చేసి ‘లక్ష్యం’గా రూపొందించారు. ఆ తర్వాత యూత్ ఫుల్ సినిమాలు బాగా ఆడుతుండటంతో ”కొంచెం ఇష్టం కొంచెం కష్టం” సినిమా చేసిన శ్రీనివాస్ ఆర్థికంగా నష్టపోయానని తెలిపారు. కొన్నాళ్ళకు ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి దగ్గర ఓ అన్నదమ్ముల కథ ఉందని చెప్పారు. అదే ‘రేసుగుర్రం’. ఇలా అన్నదమ్ముల కథతో ఆయన చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడంతో ఆయనకి ఆ కథలతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రవితేజ సినిమాలతో పాటు ఎన్టీఆర్ ‘టెంపర్’ ని విశాల్ తో తమిళంలో రీమేక్ చేస్తున్నారు