ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా రంగంలో ఆయన 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మక అవార్డును అందజేయనున్నారు. లండన్‌కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR) గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్యకు చోటు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ గౌరవాన్ని పొందిన తొలి నటుడు బాలయ్యే కావడం గమనార్హం. ఈ నెల 30న హైదరాబాద్‌లో బాలకృష్ణను సత్కరించనున్నారు.
నటుడిగా, హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాలకృష్ణ ప్రజలకు సేవలందించారు. ఆయన గొప్పతనం వెండితెరని మించి విస్తరించింది. పని ఆయన అంకితభావం, సామాజిక సేవ స్ఫూర్తిదాయకం అని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈవో సంతోశ్ శుక్లా చెప్పారు. బాలకృష్ణ సినీ రంగానికి చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసిన విషయం తెలిసిందే.
1974లో ‘తాతమ్మ కల’ అనే సినిమాతో బాలకృష్ణ సినీ జీవితం మొదలైంది. ఆ తర్వాత క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయాలు అందుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ అంటూ అన్ని జానర్లను టచ్ చేసిన అగ్ర నటుడు బాలయ్య. ఇటీవల బాలయ్య ఇంటికి జాతీయ పురస్కారాలు వరుస కడుతున్నాయి. పద్మభూషణ్ తర్వాత.. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఆయన సినిమా ‘భగవంత్ కేసరి’ ఉత్తమ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది.
ఇక సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ఆయన ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నిజానికి సెప్టెంబరు 25న రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రచారం షురూ చేయలేదు. ఎందుకా అని చూస్తే సినిమాను ‘అఖండ’ రిలీజ్ డేట్‌కే తీసుకొస్తారు అని వార్తలొస్తున్నాయి. చూడాలి మరి బోయపాటి, బాలయ్య మనసులో ఏముందో.