2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుండి మూడోసారి పోటీ చేశారు బాలయ్య (Balakrishna). 1985 నుండి ఇక్కడ టీడీపీనే విజయం సాధిస్తూ వస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనప్పటికీ.. హిందూపురంలో మాత్రం వెనకడుగు వేయలేదు. అక్కడ ఘన విజయం సాధించింది. 2014 నుండి హిందూపురం నుండి బాలయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జోరుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ గట్టిగా ప్రయత్నించింది.
ఈసారి అక్కడ మహిళా అభ్యర్థి దీపిక వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దింపడం జరిగింది. కానీ ఈమె కూడా వైసీపీ ఆశలని తీర్చలేకపోయింది. ‘హిందూపురం గడ్డ.. టీడీపీ అడ్డా’ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈసారి కూడా బాలయ్య అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఆయన హ్యాట్రిక్ సాధించినట్టు అయ్యింది. 2014 లో తొలిసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. టీడీపీ తరఫున హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలయ్య.. 16,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో కూడా 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2024 ఆయన 30 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్టు సమాచారం. ఇలా బాలయ్య హ్యాట్రిక్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. సినిమాల పరంగా కూడా ‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) వంటి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి ఫామ్లో ఉన్నారు బాలయ్య. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో.. ఇలా రెండు పడవల ప్రయాణం ఆయనకు బాగానే కలిసొస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం బాబీ (B0bby) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా అది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.