సినిమా వాళ్లకు చప్పట్లకు మించిన ప్రోత్సాహం లేదు, అవార్డులను మించి ఉత్సాహం లేదు అంటుంటారు. ప్రైవేటు సంస్థలు ఇలా ఎన్ని అవార్డులు ఇచ్చినా… ప్రభుత్వం నుండి అవార్డులు వస్తే ఆ కిక్కే వేరు. తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు ఏటా ఇవ్వకపోయినా… రెండు మూడేళ్లకు ఒకసారైనా ‘నంది’ అవార్డులు ఇచ్చేవారు. అయితే ఒక ఆరేళ్లుగా అలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదు, తెలంగాణ ప్రభుత్వం వేరే పేరుతో ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ విషయం ముందుకు కదిలేలా ఉంది.
సీనియర్ నటుడు మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏబీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇటీవల ఓ సన్మాన, బరుదు ప్రదాన కార్యక్రమం నిర్వహించింది. దానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ వేదిక మీద ‘నంది’ అవార్డుల ప్రస్తావనను తీసుకొచ్చారు మురళీ మోహన్. ఆ వెంటనే కోమటిరెడ్డి స్పందిస్తూ… వచ్చే ఉగాది నుండి తెలుగు సినిమాలకు నందులు ఇస్తామని, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలిపారు.
మరోవైపు త్వరలోనే చిత్రసీమ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధాన అజెండా నంది పురస్కారాల గురించే అని తెలుస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ పురస్కారాలకు ‘సింహా’ అని పేరు మార్చింది. అయితే ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ‘నంది’ పురస్కారాలన్ని కంటిన్యూ చేయడానికే చూస్తోంది. ఫిబ్రవరిలోగా అవార్డుల గురించి ఓ ప్రకటన రావొచ్చు అని అంటున్నారు.
అయితే పెండింగ్‌లో ఉన్న (Nandi Awards) నంది పురస్కారాలను పూర్తిగా పక్కన పెట్టి 2022 సినిమాల నుండి అవార్డుల్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాలు రెండూ కలసి ఇస్తాయా? లేక కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుందా అనేది చూడాలి. రెండు రాష్ట్రాలు కలసి ఇస్తే ఆ కిక్కే వేరు. అయితే తెలుగు సినిమాల్లో కొద్దిమంది మాత్రమే ఏపీ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నారు. ఆయన సీఎం అయ్యాక కనీసం విష్ కూడా చేయలేదు. ఈ లెక్కన నందులు ఎలా వస్తాయో చూడాలి.