సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా టైర్ 2 హీరోల్లో ఒకరు మరో యంగ్ హీరోని తొక్కేయడం కోసం పెయిడ్ పీఆర్ క్యాంపైన్ చేస్తున్నాడని ఓ యూట్యూబర్ లైవ్ స్ట్రీమ్ లో చెప్పడమే కాక, అందుకు సంబంధించిన బిల్స్ అండ్ ట్వీట్స్ స్వయంగా చూసినట్లు పేర్కొన్నాడు. దాంతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఆ హీరో మరెవరో కాదని నేచురల్ స్టార్ నాని (Nani) అని డిసైడ్ అయిపోయి, ఆ తొక్కబడుతున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అని తేల్చేశారు నెటిజన్లు. ఈ మాటలకు ఆద్యం పోస్తూ.. సదరు హీరో కావాలనే చెత్త సబ్జెక్ట్స్ అన్నీ ఇతనికి వెళ్లేలా చేస్తున్నాడని కూడా వాదనలు మొదలుపెట్టారు.
అయితే.. ఇందులో నిజమెంత అనే విషయంలోకి వెళ్లే ముందు అసలు అవసరం ఏముంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ “నువ్విలా” (Nuvvila) అనే సినిమాలో గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నప్పటికీ… నటుడిగా విజయ్ దేవరకొండకి సరైన గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం “ఎవడే సుబ్రమణ్యం” (Yevade Subramanyam). నాని స్వయంగా విజయ్ ను ఇంట్రడ్యూస్ చేశాడు, “అర్జున్ రెడ్డి” (Arjun Reddy) ట్రైలర్ ను లాంచ్ చేసింది కూడా నానినే. స్టేజ్ మీద నానికి ముద్దు పెట్టి మరీ తన ప్రేమను చాటుకున్నాడు విజయ్ దేవరకొండ.
ఆ తర్వాత విజయ్ సినిమా ఏది హిట్ అయినా ఫస్ట్ ట్వీట్ నానీదే. అలాంటి నానికి పనిగట్టుకుని విజయ్ మీద నెగిటివ్ పీఆర్ చేయించాల్సిన పనేమీ లేదు. ఇక విజయ్ దేవరకొండ వరుస పరాజయాలకు కారణం విషయానికి వస్తే.. “ట్యాక్సీవాలా” (Taxiwaala) తర్వాత విజయ్ కి సరైన విజయం లేదు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. ముఖ్యంగా “లైగర్” (Liger) డిజాస్టర్ అవ్వడం ఆ తర్వాత వచ్చిన “ఖుషీ (Kushi), ది ఫ్యామిలీ స్టార్ (Family Star)” ఫ్లాప్ అవ్వడం అనేది విజయ్ ఎంచుకున్న స్క్రిప్ట్స్ ప్రభావం. అంతే తప్ప అందులో నాని చేయించేది ఏముంటుంది. నిజానికి ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ..
ఇండస్ట్రీకి ఎలాంటి సమస్య వచ్చినా ముందు నిలబడే నాని మీద అనవసరమైన ద్వేషం స్ప్రెడ్ అవుతుండడాన్ని సహించలేక ఇవ్వాల్సి వచ్చింది. ఎవరేం అనుకున్నా నాని & విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు. ప్రస్తుతానికి నాని వరుస విజయాలతో ఒక మెట్టు పైన ఉన్నాడు, కానీ.. నాని స్థాయికి చేరుకోగల సత్తా విజయ్ దేవరకొండలో పుష్కలంగా ఉంది. అందుకు కావాల్సింది మంచి కథలు. “కింగ్డమ్” (Kingdom) నుండి విజయ్ దేవరకొండ దిశ మారవచ్చు. మరి అప్పుడు ఈ పెయిడ్ బ్యాచ్ నానిని ఏమంటాయో చూడాలి.