నెపోలియన్

  • November 24, 2017 / 08:29 AM IST

“నా నీడ పోయింది” అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనంద్ రవి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కథానాయకుడిగానూ ఆయనే నటించడం విశేషం. “ప్రతినిధి” చిత్రం ద్వారా డైలాగ్ రైటర్ గా విశేషమైన పేరు సంపాదించుకొన్న ఆనంద్ రవి దర్శకుడిగా-నటుడిగా ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించాడో చూద్దాం..!!

కథ : నెపోలియన్ (ఆనంద్ రవి) “నా నీడ పోయింది” అంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడమే కాక.. నీడ పోయింది అనే విషయం తనకు దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడు అని పోలీస్ ఇన్స్పెక్టర్ రవివర్మ (రవివర్మ)కు చెప్తాడు. అయితే.. నెపోలియన్ అసలు పేరు అశోక్ కుమార్ అని, అతడు తన భర్త అని, గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చానని చెబుతూ అదే పోలీస్ స్టేషన్ కి వస్తుంది స్రవంతి (కోమలి). కట్ చేస్తే.. నిద్రపోయినప్పుడు కనిపించే దేవుడు ఒకవారం క్రితం యాక్సిడెంట్ లో చనిపోయినట్లుగా పోలీసులు క్లోజ్ చేసిన కేస్ నిజానికి హత్య కేసని చెప్పాడని అంటాడు నెపోలియన్. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించిన రవివర్మకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఏమిటా నిజాలు? అసలు నెపోలియన్ ఎవరు? అశోక్ కుమార్ కి నెపోలియన్ కి సంబంధం ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలకు కథారూపమే “నెపోలియన్” చిత్రం.

నటీనటుల పనితీరు : ఈ చిత్రానికి దర్శకుడు మరియు డైలాగ్ రైటర్ అయిన ఆనంద్ రవి ఈ చిత్రంలో కథానాయకుడిగా టైటిల్ పాత్ర పోషించడమే సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. చాలా ఇంటెన్సిటీ అండ్ డెప్త్ ఉన్న రోల్ ను సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో మెప్పించలేకపోయాడు. అతడు కాకుండా వేరే సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు చేసినా సినిమా బాగుండేదేమో. “క్షణం” తర్వాత రవివర్మకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం “నెపోలియన్”. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ప్రశంసనీయమైన నటనతో ఆకట్టుకొన్నాడు రవివర్మ. కోమలి, ఐ.వి.రెడ్డిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ.. ఇద్దరివీ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ కావడం వారు మాత్రం ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఎక్కడా కనీసం కన్నింగ్ నెస్ కూడా చూపలేకపోవడం గమనార్హం. కేదార్ శంకర్, భాను ఆవిరినేనిలు పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : సిద్ధార్ధ్ సదాశివుని బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రెండీగా ఉంది. కథలోని ఎమోషన్ ను కూడా ఎలివేట్ చేసింది కానీ.. రిపీటెడ్ గా అదే స్క్రోర్ వాడడంతో కాస్త బోర్ కొడుతుంది.
మార్గల్ డేవిడ్ సినిమాటోగ్రఫీ స్టాండర్డ్ గా ఉంది. ఎక్కువ ఫ్రేమింగ్స్ ట్రై చేయకపోవడం, లెన్స్ లు చాలా తక్కువ వాడడం వలన.. కెమెరా ఒకేచోట నిల్చోబెట్టి ఆర్టిస్ట్స్ ను అటుఇటు తిరగమన్నారేమో అనిపిస్తుంది.

ఆనంద్ రవి రాసుకొన్న కథ పాతదే అయినా ఆ కథను నడిపే కథనంలో మాత్రం కొత్తదనం కోసం “నీడ పోయింది” అనే కాన్సెప్ట్ తోపాటు.. అక్రమ స్పీడ్ బ్రేకర్స్ ను తొలగించాలి, బార్ల ముందు పార్కింగ్ రద్దు చేయాలి వంటి డైలాగ్స్ ను జొప్పించడం మినహా చేసిందేమీ లేదు. పైగా.. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్స్ కోసం రాసుకొన్న సన్నివేశాలు క్యూరియాసిటీ పెంచలేకపోయాయి. కేవలం పబ్లిసిటీ కోసం “నీడ పోయింది” అనే కాన్సెప్ట్ ను సృష్టించారు తప్పితే.. కథకి ఏమాత్రం అవసరం కానీ ఉపయోగం కానీ పడని విషయమది.సో, ఒక డైలాగ్ రైటర్ గా పర్వాలేదనిపించుకొన్న ఆనంద్ రవి దర్శకుడిగా-నటుడిగా-కథకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు.

విశ్లేషణ : కొత్త కాన్సెప్ట్ ను క్రియేట్ చేయడం, ఆ కాన్సెప్ట్ ను ఆడియన్స్ కి చేరువ చేయడం ఎంత ఇంపార్టెంటో.. అదే కాన్సెప్ట్ తో సినిమా మొత్తాన్ని నడిపించడం కూడా అంతే ఇంపార్టెంట్. మొదటి రెండు విషయాల్లో విజయం సాధించిన “నెపోలియన్” ముఖ్యమైన మూడో విషయంలో మాత్రం బోల్తా కొట్టాడు. అందువల్ల ట్రైలర్ చూసి “ఏదో ఉంటుంది” అనుకోని థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ఏమీలేదే అనుకోని థియేటర్ల నుండి బయటపడతారు.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus