అయిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న నారా రోహిత్ కు (Nara Rohith) కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ గుండెపోటుతో మరణించారు. ఆయన స్వస్థలమైన నారావారిపల్లిలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు సన్నద్ధమవుతున్నారు. నారా రామ్మూర్తి స్వయానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ్ముడు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో కీలక సభ్యుడు.
1994 నుండి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెలేగా పనిచేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ తరచుగా వార్తల్లో నిలిచేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. తమ్ముడి ఆఖరి చూపు కోసం నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన నారావారిపల్లి బయలుదేరారు.
నారా రోహిత్ ఇటీవలే “ప్రతినిధి 2”లో (Prathinidhi 2) హీరోయిన్ గా నటించిన సిరి లెల్ల అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తండ్రి అకాల మరణంతో ఆ పెళ్లి వాయిదాపడడం తప్పనిసరి. ఇకపోతే.. నారా రోహిత్ హీరోగా “సుందరకాండ” అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా, “భైరవం” అనే తమిళ రీమేక్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతున్న ఈ తరుణంలో ఇలా తండ్రిని కోల్పోవడం బాధాకరం.