ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే మా ఎలెక్షన్స్ లో వేడి రాజుకుంటుంది. మూడు వర్గాలుగా చీలిపోయి కౌంటర్లు, ఎన్ కౌంటర్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘మా’ అధ్యక్షుడు నరేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన బయటపెట్టాడు. రీసెంట్ గా అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా శనివారం నాడు ‘మా’ అధ్యక్షుడు నరేష్ మీడియా ముందుకు వచ్చారు.
ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టడం లేదు కానీ ప్రస్తుతం జనరల్ బాడీలో ఉన్న సభ్యులే తమ పదవీ కాలం ముగియక ముందే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరారని.. వారందరినీ ప్రెస్ మీట్ లో చూసి షాకయ్యానని చెప్పారు. అదే సమావేశంలో నాగబాబు ‘మా’ మసకబారిపోయిందని చేసిన వ్యాఖ్యలపై నరేష్ రియాక్ట్ అయ్యారు. నాగబాబు కామెంట్స్ తనను ఎంతో బాధించాయని.. ఆయన తనకు ఆప్త మిత్రుడని.. అలాంటిది నాగబాబు ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యానించడం తప్పంటూ నరేష్ చెప్పుకొచ్చారు.
‘మా’ తరఫున తాము చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెప్పామని నరేష్ అన్నారు. అయినా కూడా నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని నాగబాబు అనడం షాక్ కి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయన మాటలు తప్పంటూ రియాక్ట్ అయ్యారు. లోకల్ నాన్‌లోకల్ అనే కామెంట్స్ ఎప్పుడూ చేయలేదని.. ఇప్పుడు కూడా ఎన్నిక ఏకగ్రీవం కావాలని మేము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.