సుశాంత్ సింగ్ సూసైడ్ ఘటన గడిచి ఏడాది పూర్తయిన క్రమంలో మరొక నటుడు ఇదే రోజు మరణించడం అందరిని విచారానికి గురి చేస్తోంది. గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన కన్నడ యువ నటుడు సంచారి విజయ్(37) హాస్పిటల్ లో చికిత్స తీసికుంటూ ప్రాణాలు వదిలాడు. తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ లో రక్తం గడ్డ గట్టినట్లు వైద్యులు ఆదివారమే వివరణ ఇచ్చారు. గత కొంతకాలంగా కన్నడ ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో కూడా విజయ్ మంచి క్రేజ్ అందుకుంటూ ఉన్నాడు.
‘నాను అవనల్ల.. అవలు’ అనే సినిమాలో ట్రాన్స్‌జెండర్‌గా నటించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. జూన్ 12న స్నేహితుడితో కలిసి బైక్ పై ఇంటికి వెళుతుండగా సంచారి విజయ్ అనుకోకుండా యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే అతన్ని ప్రముఖ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు అతన్ని బ్రతికించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే బ్రెయిన్ డెడ్ అవ్వడంతో వైద్యానికి అతను ఏ మాత్రం స్పందించలేదు. అతను బ్రతికే అవకాశం లేదని తెలియడంతో అవయవ దానం చేసునేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు షాక్ అవుతున్నారు. హీరో సుదీప్ కూడా విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. లాక్ డౌన్ కంటే ముందే అతన్ని కలిశానని, అతని కొత్త సినిమా రిలీజ్ కోసం అందరూ ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు. అలాగే విజయ్ కుటుంబ సభ్యులకు దేవుడు బలాన్ని ఇవ్వాలని సంతాపం తెలియజేశారు.