త్రిష కథానాయికగా గోవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాయకి’. ఈ చిత్రాన్ని గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు. తొలిసారిగా త్రిష దయ్యం పాత్రలో నటించడం విశేషం. మరి త్రిష చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అయిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..!
కథ:
సంజయ్ (సత్యం రాజేష్) ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. అన్నీ దెయ్యాల కథలే తీస్తుంటాడు. కోట్ల కోసం ఓ అమ్మాయితో పెళ్లికి ఒప్పుకొని… తన ఎంజాయ్ మెంట్ కోసం మరో అమ్మాయిని తన స్నేహితుడి ఫామ్ హౌస్ కి తీసుకెళ్తాడు. కానీ.. దారి తప్పి దుండగల్ అనే ప్రాంతానికి వెళ్తాడు. దుండగల్ ఓ నిషేధిత ప్రాంతం. అక్కడకు ఎవరెళ్లినా మాయమైపోతుంటారు. అందుకే ఆ ఊరి పొలిమేరల్లో ప్రభుత్వం కూడా గోడ కట్టిస్తుంది. ఆ ఊరి లోపల.. కోటలో గాయత్రి (త్రిష) అనే ఆత్మ తిరుగుతు ఉంటుంది. దుండగల్ చుట్టుపక్కల కనిపించకుండా పోయిన వాళ్లంతా ఆ కోటలో శవాలుగా కనిపిస్తుంటారు. ఆత్మలుగా తిరుగుతుంటారు. తన ప్రియురాలితో ఆ కోటలోకి అడుగుపెట్టిన సంజయ్‌కి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అసలు గాయత్రి ఎవరు? ఆమె కథేంటి? అనేదే నాయకి కథ.
నటీనటుల తీరు:
ఇది త్రిష సినిమా అనే ప్రేక్షకుడు థియేటర్లో అడుగుపెడతాడు. అయితే… త్రిష కంటే సత్యం రాజేష్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. త్రిష నుంచి గొప్ప ప్రదర్శనేం ఆశించలేం. తాను చాలా నార్మల్‌గా చేసింది. భయపెట్టే సన్నివేశాల్లోనూ రొమాంటిక్ చూపులతో కనిపించి ఆశ్చర్యపరిచింది. హారర్ సినిమాలు త్రిషకు కొత్త. లవ్ స్టోరీ చేసినట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే త్రిషనికాస్త చూడగలిగాం. త్రిష ఈ సినిమాలో ఓ పాట కూడా పాడింది. అయితే ఆ పాటని చివర్లో పెట్టి కిల్ చేసేశారు. చాలా కాలం తరవాత సత్యం రాజేష్‌కి ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. తన బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పంచాడు. సత్యం రాజేష్ మేకొవర్ నచ్చుతుంది. సన్నగా రివటలా ఉండే రాజేష్ హీరోలామారాడు. తొలిసారి నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర చేశాడు వెంకట్రామన్. తన కాస్ట్యూమ్స్, గెటప్ అన్నీ బాగున్నాయి. నటన పరంగానూ ఓకే. కోవైసరళ కనిపించింది ఒకే ఒక్క సీన్‌లో. మగువల మెగాస్టార్ అనే కొత్త నటుడు తాగుబోతు రమేష్, సప్తగిరిలను ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాలో మూడు పాటలున్నాయి.. మూడూ వేస్టే. రఘు కుంచె ట్యూనుల్లో కొత్తదనం ఏం లేదు. ఆర్.ఆర్ ఇచ్చిన సాయి కార్తీక్ కాస్తమెప్పించాడు. కెమెరా వర్క్ ఆకట్టుకొంటుంది. చిన్న సినిమా అయినా… నీట్‌గా తీశారు. దర్శకుడు గోవి ఎన్నుకున్న కథ ఎఫెక్టివ్ గా లేకపోవడంతో కథనం కూడా అలానే ఉంది. లాజికల్ గా సినిమా తీశామని చెప్పిన గోవి కొన్ని సీన్లలో లాజిక్స్ మిస్ అయ్యాడు. మొదటి సినిమా ఫ్లాప్ కొట్టడంతో రెండో సినిమా కసితో చేసాడు. అయితే అది కూడా బెడిసి కొట్టిందని చెప్పాలి. నిర్మాణ విఐలువలు బావున్నాయి.
విశ్లేషణ:
ఈసినిమాలో భయం కంటే… వినోదానికే ప్రాధాన్యం ఇచ్చారు. నాయకి ప్రారంభ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సంజయ్.. గాయత్రి కోటలోకి అడుగుపెట్టే సన్నివేశాలన్నీ ఉత్కంఠతకు గురి చేస్తాయి. ఆ ఇంట్లో సంజయ్ పడే పాట్లు.. గాయత్రి సంజయ్‌ని ఆడుకొనే విధానం ఇవన్నీ నవ్విస్తాయి. అయితే ద్వితీయార్థం గాడి తప్పింది. ఫ్లాష్ బ్యాక్ మరీ సాదాసీదాగా నడిచిపోయింది. సెకండాఫ్ లో ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు అతి దగ్గరగానే సాగుతుంది. క్లైమాక్స్‌లోనూ మెరుపుల్లేవు. హారర్ సినిమాకి జనాలు భయపడ్డానికి వెళ్తారు.. అంతే తప్ప నవ్వుకోవడానికి కాదు. గాయత్రి అలా ఎందుకు మారింది? తన లక్ష్యం ఏమిటన్నవే… ఆసక్తిని కలిగించే విషయాలు. వాటినీ.. మొక్కుబడి తంతుగా తీసి ఈసినిమాపై ప్రేక్షకుడు పెంచుకొన్న ఆసక్తిని చంపేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో రాజేష్‌పై పెట్టిన డ్యూయెట్ కూడా సినిమాని సాగదీయడాని తప్ప దేనికీ పనిచేయదు. సెకండాఫ్‌లోనూ ఈ సాగదీత కార్యక్రమం సాగింది. మల్లెపూల మెగాస్టార్ అంటూ ఓ క్యారెక్టర్‌ని ప్రవేశ పెట్టి ఇంకాస్త అరుపులు కేకలతో,.. విసుగు పుట్టించాడు. మొత్తానికి ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.