టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో పాటు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నయన్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార వార్తల్లో నిలుస్తున్నారు. నయన్ నటించిన అన్నపూరణి సినిమా థియేటర్లలో విడుదలై ఫ్లాప్ కాగా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా మనో భావాలు కించపరిచేలా ఉందంటూ కామెంట్లు వ్యక్తమైన నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను తొలగించింది. అన్నపూరణి సినిమా వివాదం గురించి నయన్ స్పందిస్తూ ఒక లేఖను రిలీజ్ చేశారు. జై శ్రీరామ్ అంటూ లేఖను మొదలుపెట్టిన నయనతార గత కొంతకాలంగా అన్నపూరణి సినిమా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నానని పేర్కొన్నారు.
అన్నపూరణి సినిమాను వాణిజ్య ప్రయోజనాలతో పాటు ప్రజల్లోకి మంచి ఆలోచన రావాలని తీశామని నయనతార చెప్పుకొచ్చారు. దృఢ సంకల్పంతో పని మొదలుపెడితే లక్ష్యాన్ని సాధించడం సులువేనని ఈ సినిమా ద్వారా చెప్పాలని భావించామని నయనతార పేర్కొన్నారు. మీ మనోభావాలను ఏ విధంగా అయినా గాయపరిచి ఉంటే క్షమించాలని ఆమె అన్నారు. ఈ సినిమా ఉద్దేశం ఎవరి మనోభావాలను బాధ పెట్టాలని కాదని ఆమె వెల్లడించారు.
నయనతార (Nayanthara) క్లారిటీ నేపథ్యంలో ఇకనైనా ఈ వివాదం ఆగిపోతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ వివాదం మరింత పెద్దదైతే నయనతార సినీ కెరీర్ కు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. భవిష్యత్తు సినిమాల ఎంపికలో నయనతార మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గతంతో పోల్చి చూస్తే నయనతారకు కొంతమేర ఆఫర్లు తగ్గాయి. సినిమా సినిమాకు నయనతార రేంజ్ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.