మీనాక్షి చౌదరి , జగపతి బాబు , రమ్య కృష్ణ , జయరామ్ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ,ఈశ్వరీరావు , సునీల్ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ (Cast)
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director)
ఎస్. రాధా కృష్ణ (Producer)
తమన్ ఎస్ (Music)
మనోజ్ పరమహంస పిఎస్ వినోద్ (Cinematography)
Release Date : జనవరి 12, 2024
మహేష్ బాబు–త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 14 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం “గుంటూరు కారం“. దాదాపుగా మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పట్నుంచి రకరకాల సమస్యలతో ఇబ్బందిపడి.. టార్గెట్ గా పెట్టుకొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మహేష్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ మ్యాజిక్ పాజిటివ్ గా వర్కవుటయ్యిందా? మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ దొరికిందా లేదా? అనేది చూద్దాం..!!
కథ: పదేళ్ళప్పుడు తల్లికి దూరమై.. అత్తయ్య (ఈశ్వరి రావు) లాలనలో ఒంటరినైపోయానన్న బాధతో పెరుగుతాడు వెంకట రమణ (మహేష్ బాబు). గుంటూరులో మిర్చి బిజినెస్ చేసుకుంటూ తన పని తాను చూసుకుంటున్నవాడ్ని.. వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) హైద్రాబాద్ పిలిపించి తల్లికి కానీ తల్లి ఆస్తికి కానీ ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకుంటూ సంతకం చేయమంటాడు. దాంతో.. తిక్కరేగిన రమణ, తాతయ్య వెంకటస్వామి & తల్లి వసుంధర (రమ్యకృష్ణ)పై అంతర్యుద్ధం ప్రకటిస్తాడు.
అసలు రమణగాడు ఎందుకని వసుంధరకు ఎదురు తిరిగాడు? తల్లీకొడుకుల మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? ఈ కథలో వెంకటస్వామి పాత్ర ఏమిటి? అనేది “గుంటూరు కారం” కథాంశం.
నటీనటుల పనితీరు: మహేష్ లోని సరికొత్త యాంగిల్ ను చూస్తాం. ఇప్పటివరకూ మహేష్ లో నివురుగప్పిన ఎనర్జీ ఒక్కసారిగా బయటపడడంతో మహేష్ అభిమానులు విశేషంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా మహేష్ గుంటూరు యాసలో చెప్పే డైలాగ్స్ & చాలా ఈజ్ తో వేసే డ్యాన్సులు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీలీల ఎప్పట్లానే డ్యాన్సులకి పరిమితమైపోయింది. గ్లామర్స్ గా ఉన్నా ఆమె ఎందుకో సరిగా ఎలివేట్ అవ్వలేదు. ఇక మీనాక్షి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా మిగిలిపోయింది.
ప్రకాష్ రాజ్ మరోమారు తన సీనియారిటీని ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేశాడు. కానీ.. ఆయన ముఖంలో కనిపించిన వయోభారం.. ఆయన బాడీ లాంగ్వేజ్ లో కనిపించకపోవడంతో ఆయన నటన చాలా అసహజంగా కనిపించింది. జయరాం, రమ్యకృష్ణ, ఈశ్వరి రావు, మురళీశర్మ, జగపతిబాబు, రావు రమేష్, అజయ్ ఘోష్ తదితరులు తమ సీజనల్ క్యారెక్టర్స్ లో జీవించేశారు. వెన్నెల కిషోర్ తనదైన శైలి కామెడీ టైమింగ్ తో తనను తాను ఎలివేట్ చేసుకున్న తీరు బాగుంది.
సాంకేతికవర్గం పనితీరు:తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. చాలా చోట్ల మిక్సింగ్ బాలేదు. కొన్ని చోట్ల డైలాగ్స్ సరిగా వినిపించలేదు. రెండు పాటలు మినహా సంగీత దర్శకుడిగా ప్రొజెక్ట్ కి న్యాయం చేయలేదు తమన్. సినిమాటోగ్రాఫర్లు పి.ఎస్.వినోద్ & మనోజ్ పరమహంస మాత్రం తమ బెస్ట్ ఇచ్చారు. మహేష్ ను అందంగా, సినిమాను భారీగా చూపించడంలో వందశాతం విజయం సాధించారు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, డి.ఐ వంటి విషయాల్లో నిర్మాణ సంస్థ ఎక్కడా రాజీపడలేదు.
దర్శకుడు త్రివిక్రమ్ వీకేస్ట్ వర్క్స్ లో ఒకటిగా “గుంటూరు కారం” నిలిచిపోతుంది. ఒక దర్శకుడిగా, రచయితగా ఆయన మీద జనాలకి ఉన్న గౌరవానికి భంగం కలిగే స్థాయిలో కొన్ని సన్నివేశాలు, సందర్భాలు, మాటలు ఉన్నాయి. అసలు ఈ సినిమా త్రివిక్రమ్ తీశాడా? అనే డౌట్ కూడా వస్తుంది కొన్ని సన్నివేశాల రూపకల్పన చూశాక. తన స్థాయిని తగ్గించుకొని మరీ ఇరికించిన డైలాగులు, ఇమిటేషన్ లు సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి. అయితే… క్లైమాక్స్ లో మహేష్ & రమ్యకృష్ణ నడుమ వచ్చే సన్నివేశంలో మాత్రం తన మార్క్ ను ప్రూవ్ చేసుకున్నాడు త్రివిక్రమ్.
విశ్లేషణ: మహేష్ చరిష్మా, ఎనర్జీ తప్ప ఏమీ ఆశించకుండా థియేటర్లకు వెళితే మాత్రమే “గుంటూరు కారం” చిత్రాన్ని అభిమానులు ఆస్వాదించగలరు. అయితే.. మహేష్ మ్యానియా & పండగ హడావుడి ఉంటుంది కాబట్టి కమర్షియల్ గా ఎంతవరకూ సేఫ్ అవ్వుద్ది అనేది చూడాల్సి ఉంది. ఇకపోతే.. త్రివిక్రమ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న మహేష్ అభిమానులను అంచనాలను మాత్రం ఆయన తుంగలో తొక్కాడనే చెప్పాలి.