సినిమాలు – మనోభావాలు… ఈ టాపిక్ నెవర్ ఎండింగ్ సిరీస్ లాంటిది అని చెప్పొచ్చు. ఎప్పుడూ ఏదో ఒక సినిమా వస్తూ ఉంటుంది, ఎప్పుడూ ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బ తింటూ ఉంటాయి. తాజాగా ఈ పరిస్థితి నెలకొన్న సినిమా ‘అన్నపూరణి’. నిజానికి కొన్ని రోజుల క్రితమే ఈ పరిస్థితి వచ్చినా ఇప్పుడు కాస్త పెద్ద విషయమై కూర్చుకుంది. అప్పుడు ఆందోళనలు, నిరసన నుండి తప్పించుకున్న సినిమా టీమ్ ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కుంటోంది.
మాములుగా ఒక సినిమా ఏదైనా ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలయ్యాక తీసేయడం చాలా అరుదు. ఏదో న్యాపరమైన చిక్కులు, మనోభావాల సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఇలాంటి సమస్యతోనే ‘అన్నపూరణి’ సినిమాను ఓటీటీ నుండి తొలగించింది. లవ్ జిహాద్‌ను సినిమాను ప్రోత్సహించేలా ఉందంటూ కొందరు, హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఆ సినిమా ఉందంటూ మరికొందరు సినిమా మీద విమర్శలు చేసి, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలో మధురైకి చెందిన కొంతమంది వ్యక్తులు సినిమా టీమ్ మీద, (Nayanthara) నయనతార మీద కేసు వేయడంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు కూడా సినిమాను బ్యాన్ చేయాలని గొంతుకలిపాయి. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ సినిమాను తొలగించేసింది. అయితే ఇది తాత్కాలికమా లేక మొత్తంగానా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి డిసెంబర్ 1న థియేటర్లలో విడుదైలనప్పుడే సినిమా గురించి నిరసనలు వచ్చాయి. అయితే అంత తీవ్రంగా కాదు.
దీంతో థియేటర్ల వద్ద ‘అన్నపూరణి’కి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఓటీటీకి వచ్చేసరికి పెద్ద చర్చ మొదలై రచ్చ అయింది. సంప్రదాయాలకు కట్టుబడిన ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ బిర్యానీ వండేందుకు తాపత్రయపడటం, రుచి బాగా రావాలని బురఖా వేసుకుని నమాజ్ చేయడం లాంటి అర్థం లేని సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలే రెండు వర్గాల వారికీ ఇబ్బంది పెట్టాయి. అవే ఇప్పుడు సినిమా ఓటీటీ నుండి ఎగిరిపోయేలా చేశాయి.