“సెటిల్ అవ్వడం అంటే ఏమిటి?” అని ప్రెజంట్ జనరేషన్ కి ఉన్న ఒక కామన్ క్వశ్చన్ ను కథాంశంగా ఎంచుకొని వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం “నీదీ నాదీ ఒకే కథ”. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం టీజర్ మొదలుకొని సాంగ్స్, ట్రైలర్స్ సినిమాకి విపరీతమైన బజ్ ను క్రియేట్ చేశాయి. మరి క్రియేట్ అయిన హైప్ రేంజ్ లో సినిమా ఉందా లేదా అని చూద్దాం..!!
కథ : డిగ్రీలో మిగిలిపోయిన రెండు సబ్జెక్టులు క్లియర్ చేయడం కోసం రెండేళ్ల నుంచి సప్లీ పరీక్షలు రాస్తూ అవి పాస్ అవ్వలేక, ఇంట్లో నాన్న దగ్గర తిట్లు పడలేక బాధపడే సగటు విద్యార్ధి రుద్రరాజు సాగర్ (శ్రీవిష్ణు). అయిదేళ్లవుతున్నా డిగ్రీ పాస్ అవ్వలేకపోతున్నాడని చుట్టుపక్కలవాళ్లు హేళనగా చూస్తుంటే.. త్వరగా సెటిలవ్వరా అంటూ తండ్రి రుద్రరాజు దేవీప్రసాద్ 9దేవీప్రసాద్) కంగారు పెడుతుంటాడు. కానీ.. సాగర్ కి అర్జంట్ గా చదివేసి, పాసైపోయి గొప్ప స్థాయికి ఎదిగిపోవాలన్న తపన ఉండదు. తన బుర్ర ఆలోచించగల స్థాయిలోనే కలలు కంటుంటాడు.
కానీ.. తనను అమితంగా ప్రేమించే తండ్రి కోసం, తండ్రి కోరుకొనే విధంగా మారాలి అనుకొంటాడు. ఆలోచన బాగున్నా.. దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది సాగర్ కి, అప్పుడే కొత్తగా తమ కాలనీలోకి వచ్చిన ధార్మిక (సాట్నా) సహాయం కూడా తీసుకొంటాడు. అయితే.. తాను సెటిల్ అవ్వాలంటే తన బుర్రకి ఎక్కని చదువుతో పనేంటీ? చదువు లేకుండా కూడా చాలామంది సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు కదా అనే భావన ఒకవైపు.. తాను మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యి తండ్రికి సమాజంలో మంచి పేరు తీసుకురావాలన్న ఆలోచన మరోవైపు.. ఈ ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సాగర్ చివరికి ఏం నిర్ణయం తీసుకొన్నాడు అనేది “నీదీ నాదీ ఒకే కథ” కథాంశం.
నటీనటుల పనితీరు : సాధారణంగా సినిమాలో హీరోహీరోయిన్ల పనితనం గురించి చర్చించిన తర్వాత మిగతా పాత్రధారుల గురించి మాట్లాడుకొంటామ్. కానీ.. మొదటిసారి సినిమాలో నాయకానాయికల నట ప్రతిభను పొగిడే ముందు తండ్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఒక మధ్య తరగతి తండ్రి మనోభావాలను తెరపై సజీవంగా చూపిన దర్శకుడు దేవీప్రసాద్ గురించి చెప్పుకోవాలి. కొడుకంటే విపరీతమైన ప్రేమ కలిగిన తండ్రిగా, “సమాజంలో పేరు/గౌరవం” కోసం తాపత్రయపడే సగటు మనిషిగా దేవీప్రసాద్ నటన అద్భుతం. ఆయన్ను తెరపై చూస్తున్న ప్రతిసారి “మా నాన్నగారు కూడా ఇలాగే ఉండేవారు కదా” అని ఒక్కసారైనా అనుకోకుండా థియేటర్లలో నుంచి జనాలు బయటకిరారు. ఆయన ముఖంలో సహజత్వం, డైలాగ్ డెలివరీలో స్పష్టత పాత్రకు ప్రాణం పోసాయి.
“జీవితంలో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తూ టెన్షన్ పడిన” ప్రతి ఒక్కరూ శ్రీవిష్ణు పాత్రకు కనెక్ట్ అవుతారు. తండ్రి అభిమానం చూరగొనడం కోసం తాపత్రయపడే కొడుకుగా, తన సెల్ఫ్ ఐడెంటిటీని కోల్పోతూ మానసిక సంఘర్షణకు గురయ్యే యువకుడిగా శ్రీవిష్ణు నటన, అతడి బాడీ లాంగ్వేజ్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ప్రతి ప్రేక్షకుడు “నా జీవితంలో ఫలానా ఫేస్ లో ఇలాగే ఫీల్ అయ్యాను” అని తనను తాను చూసుకొంటుంటాడు. అయితే.. క్యారెక్టరైజేషన్ అనేది సరిగా ఎస్టాబ్లిష్ కాకపోవడం, అసలు హీరో ఎందుకు ఆరాటపడుతున్నాడు అనే విషయంలో స్ట్రాంగ్ ఎమోషన్ లేకపోవడం అనేది చిన్న మైనస్.
కథానాయికగా నటించిన “బిచ్చగాడు” ఫేమ్ సాట్నా టిటస్ ఈ సినిమాలో ఒక్కో ఫ్రేమ్ లో ఒకలా కనిపించింది. షూటింగ్ మధ్యలో ఆమెకు వివాహం జరగడం ఈ లుక్స్ పరమైన మార్పులకు కారణం అయ్యుండొచ్చు. అయితే.. ఆమె పాత్ర ద్వారా సమాజంలో కొందరు “తెలివైనవాడు, జ్ణాని” అనిపించుకోవడం/పిలిపించుకోవడం కోసం ఎలా అబద్ధపు జీవితాలు జీవిస్తున్నారు అనే విషయాన్ని తెలియజెప్పిన విధానం అభినందనీయం. చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి, తల్లి పాత్రలో జీవించిన నటీమణుల పేర్లు తెలియదు కానీ.. వారి వారి పాత్రల్లో ఇద్దరూ జీవించారు.
సాంకేతికవర్గం పనితీరు : సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి పనితనం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. టైటిల్ కార్డ్స్ లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ నుంచే సినిమా ఏ జానర్ కి చెందింది అనే పూర్తి ఐడియాను జనాల మెదళ్ళలో ఫీడ్ చేస్తాడు. పాటలు కొత్తగా ఉన్నాయి, నేపధ్య సంగీతం సహజంగా ఉంది.
“అర్జున్ రెడ్డి” ఫేమ్ రాజ్ తోట “నీది నాది ఒకే కథ” ఫ్రేమింగ్స్ బాగున్నాయి. స్టాండర్డ్ ఫ్రేమ్స్, టైట్ క్లోజ్ షాట్స్ తోనే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన విధానం బాగుంది.
దర్శకుడు వేణు ఉడుగుల రాసుకొన్న కథలో జీవం ఉంది, దాన్ని తెరకెక్కించిన విధానంలో సహజత్వం ఉంది. కానీ.. ఏదో లోపించింది అనే భావన వెంటాడుతుంది. అసలు కథానాయకుడ్ని తండ్రి ఎప్పుడూ “నువ్ ఇలా ఉండాలి అని, ఇలాగే బ్రతకాలి అని ఫోర్స్ చేయలేదు కదా”, చదువంటే ఇష్టం, ఆసక్తి లేని కథానాయకుడికి తన జీవితంలో “ఇలా బ్రతకాలి” అనే క్లారిటీ ఎందుకు లేదు?, అన్నిటికీ మించి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండే హీరోకి ఉన్నట్లుండి క్లారిటీ ఎలా వచ్చింది? అందుకు ప్రేరేపించిన సంఘటనలు ఏమిటి? అనేవి ఇంకాస్త ఇంపాక్ట్ ఫుల్ గా తెరకెక్కించి ఉంటే ప్రేక్షకుడి మనసులో సినిమా చెరగని ముద్ర వేసేది. ముఖ్యంగా సినిమాలో హీరో క్యారెక్టర్ ట్రాన్స్ ఫార్మేషన్ ను ఇంకాస్త ఎలివేట్ చేసేలా కనీసం రెండుమూడు సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. అలాగే.. సినిమా మొదలైనప్పట్నుంచి తాను ఏం చెప్పాలనుకొంటున్నాడో పోసాని ఎపిసోడ్స్ ద్వారా తెలియజేసిన విధానం బాగుంది. “డబ్బు సంపాదించడం ఎలా అని పుస్తకం రాసిన వ్యక్తి.. డబ్బుల్లేక ఆ పుస్తకాన్ని ప్రచురించలేకపోయాడు” అని చెప్పించడం బాగుంది.
ఎందుకంటే.. గొంగళి పురుగు “మెటమార్ఫసిస్” పద్ధతి ద్వారా సీతాకోకచిలుకలా ఎలా రూపాంతరం చెందింది అని చెబుతున్నప్పుడు ప్రతి దశను విశదీకరించి వివరించాలి.. అలా కాక డైరెక్ట్ గా “గొంగళిపురుగు కొన్నాళ్లు పడుకుని లేచాక సీతాకోకచిలుక అయిపోతుంది” అని చెబితే విద్యార్ధి ఎలా కన్ఫ్యూజ్ అవుతాడో.. “నీదీ నాదీ ఒకే కథ” సినిమా చూస్తున్నప్పుడు “హీరోలో ఉన్నట్లుండి ఈ మార్పుకి కారణం ఏంటి, వచ్చిన మార్పు కూడా నారా రోహిత్ పోషించిన స్పెషల్ రోల్, హీరోయిన్ పాత్ర ఫోర్స్ వల్ల వచ్చిందే కదా?” అనుకుంటూ థియేటర్ నుంచి బయలుదేరతాడు.
ఓవరాల్ గా చెప్పాలంటే.. ఇది అందరి కథ, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఏదో ఒక ఫేస్ లో ఈ విధంగా ఆలోచించి ఉంటారు. అందువల్ల అందరికీ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే సినిమా “నీదీ నాదీ ఒకే కథ”. కాకపోతే సరైన ఎమోషన్ లేకపోవడం వలన ఊహించినస్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు.
విశ్లేషణ : సక్సెస్ స్టోరీస్ చూసి చూసి బోర్ కొట్టేసిందా, ఒక మనిషి డబ్బు సంపాదించడం కోసం చిన్న చిన్న ఆనందాల్ని వదిలేసుకొని ఎలా తన జీవితానికి తానే విలన్ గా మారుతున్నాడో తెలుసుకోవాలనుకొనేవారు “నీదీ నాదీ ఒకే కథ” చిత్రాన్ని తప్పకుండా చూడాలి. అయితే.. కథనంలో లోపించిన్ క్లారిటీని ఇగ్నోర్ చేయగలిగితే ఈ సినిమా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయం.
రేటింగ్ : 2.5/5