పీరియాడిక్ సినిమాలు చేసేటప్పుడు దర్శకులు, నిర్మాతలు అన్ని విషయాల్లోనూ చాలా కేర్ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో..! కథని అందంగా చూపించడానికి సినిమాటోగ్రాఫర్ ఎంత అవసరమో.. అందులోని ఎమోషన్ ని అందం వర్ణించడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ముఖ్యం. చాలా సినిమాలతో ఈ విషయం ప్రూవ్ అయ్యింది. ఈరోజు ‘కంగువా’తో (Kanguva) మరోసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. విషయం ఏంటంటే.. ‘కంగువా’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)సంగీతం అందించాడు.
సాధారణంగా అతను అన్ని సినిమాలకి మంచి మ్యూజిక్ ఇస్తుంటాడు. కానీ పీరియాడిక్ సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కడో ట్రాక్ తప్పుతున్నట్టు కనిపిస్తుంది. ‘పుష్ప’ (Pushpa) లాంటి పీరియాడిక్ సినిమా చేసినప్పుడు అతను మంచి ఔట్పుట్ ఇచ్చాడు. ‘పుష్ప 2’ (Pushpa2) గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే అది దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే అనడంలో సందేహం లేదు. మరేంటి అతనితో.. ప్రాబ్లమ్ అంటారా? అక్కడికే వస్తున్నా..!
ఈరోజు రిలీజ్ అయిన ‘కంగువా’ ని గమనిస్తే, అతను ఒక్కటే ట్యూన్ ని రిపీటెడ్ గా కొట్టుకుంటూ పోయాడు. కొన్ని చోట్ల అయితే అది చాలా లౌడ్ గా అనిపించింది. ఇక్కడ ఇంకో విషయం గమనిస్తే.. తమిళంలో తెరకెక్కే పీరియాడిక్ సినిమాలకే దేవి పనితనం తేడా కొడుతోంది. గతంలో విజయ్ నటించిన ‘పులి’ (Puli) సినిమాకి కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాలో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తేడా కొట్టింది.
సేమ్ సీన్ ‘కంగువా’ కి కూడా రిపీట్ అయ్యింది. ప్రాబ్లమ్ దేవీలో ఉందా? లేక దర్శకులు అతన్ని సరిగ్గా వాడుకోలేదా అనేది అతనికే తెలియాలి. దేవి ఫామ్లో లేడు అని అనుకుంటున్న టైంలో ‘కంగువా’ తో అతను గట్టి సమాధానం చెబుతాడు అనుకుంటే.. ఇలాంటి కామెంట్స్ వినిపిస్తుండటం విషాదకరం. ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అతన్ని దూరం పెట్టడానికి కూడా ఇదే కారణమా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.