ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కాస్తో కూస్తో జనాల దృష్టిని ఆకర్షించిన సినిమాల్లో ‘నేనే నా?’ కూడా ఒకటని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రెజీనా ఈ సినిమాలో హీరోయిన్.ఆమెదే ప్రధాన పాత్ర కూడా..! ఇక సందీప్ కిషన్ తో ‘నిను వీడని నీడను నేనే’ వంటి డీసెంట్ హిట్ చిత్రాన్ని అందించిన కార్తీక్ రాజు దర్శకుడు.వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.ఏడాది క్రితమే ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ..
ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎటువంటి ప్రమోషన్ లేకుండా కేవలం మౌత్ టాక్ పై డిపెండ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : నల్గొండ కి సమీపంలో ఉన్న అడవుల్లోకి ఓ విదేశీయుడు టూరిస్ట్ గా వెళతాడు. అక్కడ ఊహించని విధంగా అతను మాయమవుతాడు. అడవిలో ఉన్న ఊబిలో అతను చిక్కుకుని చనిపోయాడు అంటూ పోలీసులు గుర్తిస్తారు. అయితే అతని డెడ్ బాడీ లభించదు. ఈ సమస్యను పరిష్కరించడానికి పురాతన వస్తు శాఖలో పనిచేసే దివ్య(రెజీనా) సాయం కోరుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్ రాజా(వెన్నెల కిషోర్) సాయంతో దివ్య అక్కడ పాతి పెట్టిన ఓ డెడ్ బాడీకి సంబంధించిన స్కెలిటన్ ని బయటకు తీసి .. పోలీస్ డిపార్ట్మెంట్ కి అందజేస్తుంది.
అయితే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వారి పరిశోధనలో … ఆ స్కెలిటన్ విదేశీయుడిది కాదు ఎన్నో ఏళ్ల క్రితం మరణించిన దమయంతి(రెజీనా )కి సంబంధించింది అని తేలుతుంది. ఆ తర్వాత దమయంతి.. డీసీపీని అలాగే అతని తమ్ముడిని హతమారుస్తుంది. అసలు దమయంతికి? దివ్యకి సంబంధం ఏంటి? ఇద్దరూ ఒకేలా ఎందుకు ఉన్నారు. దమయంతి ఆత్మగా వచ్చి డీసీపీని, అతని తమ్ముడిని ఎందుకు చంపింది? అసలు అడవిలో మాయమైన విదేశీయుడు ఎవరు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : ఈ విభాగంలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది వెన్నెల కిషోర్ గురించి. ఎందుకు అంటారా? రెజీనా ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించినప్పటికీ.. ఎక్కువ స్క్రీన్ స్పేస్ మాత్రం వెన్నెల కిషోర్ పాత్రకే దక్కింది. ఫారెస్ట్ ఆఫీసర్ రాజా పాత్రలో అతను కనిపిస్తాడు. కొన్ని చోట్ల నవ్వించాడు. ఇంకొన్ని చోట్ల విసిగించాడు. డీసీపీ మర్డర్ కు సంబంధించిన గెస్ట్ హౌస్ ఎపిసోడ్లో ఇతను చేసిన కామెడీ బాగా నవ్విస్తుంది. కానీ ఈ పాత్రకు సరైన ఎండింగ్ ఇవ్వలేదు.
ఇక రెజీనా .. దివ్య, దమయంతి అనే రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది. ఆత్మగా అంటే దమయంతి పాత్రలో ఈమె భయపెట్టింది అంటూ ఏమీ లేదు.ఆ పాత్రకు సంబంధించిన లుక్ కూడా ఈమెకు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఈ పాత్ర ఎంటర్ అయినప్పుడే జనాలకి కథ ఏంటి అనే ఓ ఐడియా వచ్చేస్తుంది. అయితే దివ్య పాత్రలో మాత్రం డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. వి.జయ ప్రకాష్ తనకు సూట్ కాని పాత్రలు మళ్ళీ పోషించాడు.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఇతని లుక్ అస్సలు సెట్ అవ్వలేదు. అక్షర గౌడ మరోసారి తన కెరీర్ కి ఎందుకూ ఉపయోగపడని పాత్రను పోషించింది. తాగుబోతు రమేష్ కామెడీ బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. మిగతా నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు కార్తీక్ రాజు ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో ఓ డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాలో కూడా కొన్ని మైనస్సులు ఉన్నా.. అందులో ఎమోషన్ వర్కౌట్ అవ్వడంతో పాస్ మార్కులు వేయించుకుంది. ‘నేనే నా?’ విషయానికి వస్తే.. సినిమా మొదటి 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఎక్సయిట్మెంట్.. సినిమా చూసే ప్రేక్షకులకు కలుగుతుంది. కానీ ఎప్పుడైతే దమయంతి పాత్ర ఎంటర్ అయ్యిందో అక్కడ జనాలకు మిగతా భాగం పై ఓ ఐడియా వచ్చేస్తుంది.
అందుకే వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ ల కామెడీతో నెట్టుకురావాలని చూశాడు దర్శకుడు. అది జనాలను ఎంటర్టైన్ చేయకపోగా విసిగించింది అని చెప్పాలి. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది. ‘నాగవల్లి’ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంత ట్రోల్ మెటీరియలో.. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దానికి మించిన ట్రోల్ మెటీరియల్ అని చెప్పాలి. ‘క్లైమాక్స్ ఎలా ముంగించాలో కూడా దర్శకుడికి అర్థం కాలేదు కాబోలు’ అనే డౌట్ కూడా అందరికీ వచ్చే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలి అంటే అది ప్రొడక్షన్ వాల్యూస్ అనే చెప్పాలి. అవసరానికి మించే నిర్మాత ఖర్చు చేశాడు కానీ ఎక్కడా తగ్గలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. సామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొదట బాగానే ఉంది అనిపిస్తుంది.తర్వాత అది కూడా ఇంప్రెస్ చేయదు. మళ్ళీ క్లైమాక్స్ లో ఓకే అనిపిస్తుంది. గోకుల్ బినోయ్ సినిమాటోగ్రఫీకి కూడా మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ లో అతని పనితనం బాగా ఇంప్రెస్ చేస్తుంది.
విశ్లేషణ : ‘నేనే నా?’.. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ పోర్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ తర్వాత రొటీన్ హార్రర్ కామెడీ థ్రిల్లర్ ఫ్లేవర్ కి షిఫ్ట్ అయ్యి విసిగిస్తుంది.
రేటింగ్ : 1/5
Rating
1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus