డబ్బులు పోయి ఒక వ్యక్తి బాధగా కూర్చుంటే.. స్నేహితుడో, కుటుంబ సభ్యుడో వచ్చి.. ఏం చేస్తాం అంతా మన ఖర్మ. అంటూ భగవద్గీతలో శ్లోకం చెబితే ఎలా ఉంటుంది. సర్రున కోపం వస్తుంది కదా. ఇప్పుడు సమంత సోషల్ మీడియా పోస్ట్ చూసినా అలానే ఉంది. అయితే ఇక్కడ సర్రును కోపం వస్తోంది నెటిజన్లకు. కాస్త క్లారిటీ లేదు కానీ.. దిల్ రాజు, గుణశేఖర్‌కు కూడా ఇలానే కోపం వస్తోందేమో. ఎందుకంటే ‘శాకుంతలం’ పోయి, డబ్బులు పోయిన బాధలో ఆ ఇద్దరూ ఉంటే.. సమంత వేదాంతం చెబుతోంది.
గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత (Samantha) నటించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ఫలితంపై ‘శాకుంతలం’ టీమ్ ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలో సినిమా మాత్రం పరోక్షంగా స్పందించింది. అది కూడా భగవద్గీతలోని శ్లోకాన్ని ఉటంకిస్తూ ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దాంతోపాటు కారులో కూర్చొని బయటకు చూస్తూ ఉన్న ఫొటో షేర్‌చేసింది.
ఆ ఫొటోకు క్యాప్షన్‌గా ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన| మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి” అనే గీతా శ్లోకాన్ని రాసుకొచ్చారు. అంటే.. పని చేయడం వరకే నీకు అధికారం. దాని ఫలంతో నీకు సంబంధం లేదు. అందుకే ప్రతిఫలం ఆశించి ఏ పనీ చేయకు. అలా అని పని చేయడం మానకు. అంటే విజయాలు వస్తుంటాయి, అపజయాలు ఎదురవుతాయి, అయినా పని మనం చేసుకుంటూ వెళ్లాలి అనేది సమంత మాట. కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజమని, అలా అని వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోతే జీవితంలో ముందుకు వెళ్లలేమన్నది సామ్ అభిప్రాయంగా తెలుస్తోంది.
సరే ఇలాంటి ఫ్లాపులు అందరికీ సహజమే కానీ సమంత లుక్స్, డబ్బింగ్ మీద కూడా విమర్శలు వచ్చాయి. వాటి గురించి సమంత ఇలాగే వేదాంత ధోరణిలో ఏదైనా సమాధానం చెబితే బాగుండు అంటున్నారు. తన ప్రయత్నం విషయంలోనూ లోపం ఉండి.. ఇలా మట్లాడటం సరికాదు అంటున్నారు. డబ్బులు పోయి నిర్మాత, దర్శకులు బాధపడుతుంటే ఇలా ఎందుకు అంటున్నారు. మరి దీనికి సామ్ ఏమైనా సమాధానం చెబుతుందేమో చూడాలి.