తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో కథానాయికలు నటించడంతో పాటు సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. అందరూ తెలుగు వారే కావడంతో అప్పుడు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు. ఆ తర్వాత పరభాషా తారల హావ పెరిగింది. వచ్చామా.. నటించామా.. వెళ్లిపోయామా.. అనే అలవాటు వచ్చింది. వారు పదేళ్ల పాటు పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇతరులు డబ్బింగ్ చెప్పాల్సి వస్తోంది. కాజల్, తమన్నా, త్రిష, సమంత తదితరులకు తెలుగు మాట్లాడటానికి వచ్చినప్పటికీ ఇతరులు డబ్బింగ్ చెప్పాల్సిందే. అయితే నేటి యువ కథానాయికలు ఈ విధానానికి స్వస్తి చెబుతున్నారు. సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు. అ.. ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. అలాగే సాయి పల్లవి ఫిదా మూవీలో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టింది.
హాట్ భామ కేథరిన్ సైతం గౌతమ్ నంద లో డబ్బింగ్ చెప్పుకుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ తమపాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని తెలిసింది. అలాగే సాహో సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ కూడా ప్రత్యేకంగా తెలుగు మాస్టర్ ని నియమించుకొని, తెలుగు నేర్చుకొని నటించడమే కాదు.. డబ్బింగ్ చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తోంది. నేటి హీరోయిన్స్ తీరు.. నాటి రోజుల్ని గుర్తుకు తెస్తోంది.